
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ మాసంలోముస్లింలు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. అయితే అప్పట్లో సహర్, ఇఫ్తార్ సమయాలనిర్ధారణ సరిగా లేకపోవడంతో ఇబ్బందులుఎదురయ్యాయి. దీన్ని గ్రహించిన నిజాం సమయ నిర్ధారణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో భూగోళ, ఖగోళ పరిశోధనలు చేయించారు.అనంతర ప్రొఫెసర్లు ఒక సమయ పట్టికను
రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ దీన్నే ఉపయోగిస్తున్నారు.
సహర్, ఇఫ్తార్ సమయాల నిర్ధారణకు 1930లో అప్పటి ఓయూ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ వాసే ఆధ్వర్యంలోని బృందం వివిధ పరిశోధనలు చేసింది. పదేళ్లు భూగోళ, ఖగోళ పరిశోధనలు చేసిన బృందం 290 పేజీలతో ఒక పుస్తకాన్ని రూపొందించింది. దీనిని మియారుల్ అవుకాత్(సమయ నిర్ధారణ) అంటారు. ఈ పుస్తకం ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా సహర్, ఇఫ్తార్ సమయాలను పాటిస్తున్నారు. ఈ పుస్తకం ఇప్పటికీ ఓయూలో అందుబాటులో ఉంది.
1970 నుంచి ప్రచురణ..
అప్పట్లో దిన, వార, మాస పత్రికల్లో రంజాన్ మాసానికి ముందే ఉపవాస పట్టికను ప్రచురించేవారు. 1970 నుంచి ఉపవాస సమయ పట్టిక ప్రచురణకు ఆదరణ లభించింది. తర్వాత 1994 నుంచి దీన్ని అన్ని హంగులతో మల్టీ కలర్‌లో ప్రింట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చెత్తబజార్ మార్కెట్‌లో ప్రచురించి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకకు తీసుకెళ్తున్నారు. ఇందులో సహర్, ఇఫ్తార్ సమయాలు, ఆ సమయాల్లో చదివే దువాలు, ఖురాన్ సూక్తులు, ప్రవక్త ప్రత్యేక ప్రారర్థనలు కూడా ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 కోట్ల కార్డులు ప్రింట్ చేయించారు. చాలా మంది వీటిని ప్రింట్ చేయించి ఉచితంగా పంపినీ చేస్తారు. ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం.