
వివిధ రకాల డ్రై ఫ్రూట్స్
అబిడ్స్ : రంజాన్ సందడి బేగంబజార్‌లో జోరుగా కొనసాగుతోంది. పాతబస్తీ బేగంబజార్‌లో హోల్‌సేల్ వ్యాపారస్తులు పెద్దఎత్తున డ్రై ఫ్రూట్స్ విక్రయాలు చేస్తున్నారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. దీంతో పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల వాసులు పెద్దఎత్తున బేగంబజార్‌లో ఖర్జూరంతో పాటు డ్రైఫ్రూట్స్ విక్రయాలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలాసా నుంచి వచ్చే ఖాజూలను పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. రంజాన్ మాసం సగం అయినా విక్రయాలు పుంజుకున్నాయి. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో హోల్‌సెల్ ధరలకే విక్రయిస్తుండటంతో నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
విదేశాల నుంచి దిగుమతి...
విదేశాల నుంచి నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఇరాన్ దేశం నుంచి ఖర్జూరాలు, అమెరికా నుంచి బాదం, పలు అరబ్ దేశాల నుంచి పిస్తా, వాల్‌నట్స్, అంజూర్, ఎండు ద్రాక్ష, కుర్బానిలాంటి డ్రై ఫ్రూట్స్ న్యూ ఢిల్లీ నుంచి నగరానికి దిగుమతి అవుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారు. కాజు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పలాసా నుంచి దిగుమతి అవుతోంది.
డ్రై ఫ్రూట్స్ ధరలు ఇవే...
బేగంబజార్ హోల్‌సెల్ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు కిలో చొప్పున ఇలా ఉన్నాయి. ఖాజు కిలో రూ.780 నుంచి రూ.1200 వరకు, ఆలమోండ్స్ కిలో రూ.700 నుంచి రూ.2,800ల వరకు, పిస్తా కిలో రూ.వెయ్యి నుంచి రూ.1,800ల వరకు, ఖర్జూరా కిలో రూ.180 నుంచి రూ.1,600ల వరకు విక్రయాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఖాజు, బాదం ధరలు కిలోకు 10 నుంచి 20 శాతం పెరిగాయి.
హోల్‌సెల్ ధరలకే రిటైల్ అమ్మకాలు
డ్రైఫ్రూట్స్‌ను హోల్‌సెల్ ధరలకే రిటైల్‌గా విక్రయిస్తున్నాం. రంజాన్‌తో పాటు దసరా, దీపావళి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రైఫ్రూట్స్ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. రంజాన్ మాసం కావడంతో ఖర్జూలతో పాటు డ్రైఫ్రూట్స్ విక్రయాలు రెండింతలు పెరిగాయి. 1967లో హోల్‌సెల్ డ్రైఫ్రూట్ షాపును ప్రారంభించిన తాము రిటైల్ వారికి కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా హోల్‌సేల్ ధరలకే విక్రయిస్తున్నాం. డ్రైఫ్రూట్స్‌తో మనిషి ఆరోగ్యకరంగా ఉంటాడు. ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. ఈ మధ్య కాలంలో డ్రైఫ్రూట్స్ విక్రయాలు చాలా పెరిగాయి.
– రాహుల్ సాంక్ల, శ్రీకిషన్ సత్యనారాయణ సాంక్ల డ్రైఫ్రూట్స్ దుకాణం యజమాని
Comments
Please login to add a commentAdd a comment