కేసీఆర్‌ది అనైతిక పాలన
నిజామాబాద్ అఖిలపక్షాల జలసాధన యాత్రలో జానారెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజలను భయపెట్టి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనైతిక, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి మండిపడ్డారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ పనుల యథాతథంగా కొనసాగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జలసాధన యాత్ర పేరిట కామారెడ్డిలోని భూంపల్లి చెరువు నుంచి పద్మాజీవాడీ వరకు నిర్వహించిన పాదయాత్ర, అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘నాడు హోంమంత్రిగా ఉన్న నేను అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను చర్చలకు పిలిచాను.
కానీ, ఈ సీఎం ప్రజాసమస్యల కోసం వెళ్లిన కమ్యూనిస్టు నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇంత నియంతృత్వమా.. ఇది ఒక ప్రభుత్వమేనా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరిట రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, సారంపెల్లి మల్లారెడి(సీపీఎం), మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, గుండా మల్లేశ్, వేములపల్లి వెంకట్రామయ్య(న్యూడెమోక్రసీ), బీజేపీ, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
అఖిలపక్షం నోట.. వైఎస్‌ఆర్ మాట...
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం పాదయాత్ర, బహిరంగసభ సందర్బంగా పలువురు అఖిలపక్ష నేతలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు గుండెకాయలాంటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయనే అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ తదితరులు సభలో వైఎస్‌ఆర్‌ను గుర్తు చేశారు.