నగరంలో ఐఎంఏ ప్రకంపనలు | IMA Scam Cases in Hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో ఐఎంఏ ప్రకంపనలు

Published Wed, Aug 21 2019 11:36 AM | Last Updated on Sat, Aug 31 2019 12:16 PM

IMA Scam Cases in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా చోటు చేసుకుని దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఐ మానిటరీ అడ్వైజరీ (ఐఎంఏ) పోజీ స్కామ్‌ ప్రకంపనలు సిటీలోనూ వెలుగు చూశాయి. వివిధ స్కీముల పేరుతో దాదాపు రూ.4 వేల కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుందే. ఇదే రోజు ఆరుగురు బాధితుల ఫిర్యాదు మేరకు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) ఓ కేసు నమోదైంది. ఈ బాధితులు ఐఎంఏ గోల్డ్‌ స్కీమ్‌లో రూ.48 లక్షల మేర పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని పోలీసులు చెప్తున్నారు. కర్నూలుకు చెందిన మహ్మద్‌ మక్సూద్‌ అహ్మద్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసి గెజిటెడ్‌ హోదాలో ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం నగరంలోని సైదాబాద్‌లో నివసిస్తున్న ఈయనకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ గత ఏడాది జూన్‌లో అందాయి. అదే సమయంలో తన పాత స్టూడెంట్స్‌ను కలవడానికి భార్యతో కలిసి బెంగళూరు వెళ్ళిన ఈయనకు ఐఎంఏ సంస్థ లావాదేవీల విషయం తెలిసింది. ఆ సంస్థ బంగారం వ్యాపారం చేయడంతో పాటు ప్రింటింగ్‌ ప్రెస్, హాస్పిటల్, మెడికల్‌ షాపులు, స్కూల్, అపార్ట్‌మెంట్స్, సూపర్‌మార్కెట్స్‌ సైతం నిర్విహిస్తోందని, వివిధ స్కీముల్లో డిపాజిట్లు సేకరించి తన 17 సంస్థల్లో పెట్టుబడులు పెడుతోందని తెలుసుకున్నారు.

దీంతో అక్కడి శివాజీనగర్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్ళి ఆరా తీశారు. అందులో ఉన్న హంగు ఆర్భాటాలతో పాటు సిబ్బంది ప్రవర్తన, మాట తీరు ఎంతో ఆకట్టుకున్నాయి. తమ పూర్తి స్థాయి చట్టబద్దత ఉన్న సంస్థగా చెప్పిన ఐఎంఏ ఉద్యోగులు డిపాజిట్లుగా స్వీకరించిన మొత్తంతో లండన్‌ నుంచి బంగారం దిగుమతి చేసుకుంటామని ఆయనతో పేర్కొన్నారు. దీన్ని ఆభరణాలుగా మార్చి దేశంలోని వివిధ నగరాల్లో విక్రయిస్తామని, తాము తయారు చేసే గాజులకు కోల్‌కతాలో, నగలకు సూరత్‌లో ఇతర వస్తువులకు ముంబై తదితర చోట్ల మంచి డిమాండ్‌ ఉందంటూ వివరించారు. ఈ వ్యాపారంలో తమ సంస్థకు నెలకు 20 శాతం లాభం వస్తుందని, అందులో నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు తదితరాలు పోను పెట్టుబడిదారులకు 3 నుంచి 4 శాతం లాభం పంచుతామని నమ్మబలికారు. ఐఎంఏ సంస్థల్లో మొత్తం 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, మీ లాంటి వాళ్ళు డిపాజిట్‌ చేస్తేనే వాళ్ళు బతకడంతో పాటు ఇతర స్వచ్చంద కార్యక్రమాలు నడుస్తాయంటూ నమ్మించారు. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో మహ్మద్‌ మక్సూద్‌ అహ్మద్‌ రూ.10.51 లక్షలు, ఆయన భార్య రూ.12.51 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఐఎంఏ సంస్థ వీరి నుంచి నగదు కాకుండా చెక్కుల రూపంలోనే తీసుకోవడంతో మరింత నమ్మకం కలిగింది. ఐఎంఏ వీరికి పాస్‌పుస్తకాలు, బాండ్లు తదిరాలు జారీ చేసి వీరి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంది.

కచ్చితంగా ప్రతి నెలా ఒకటో తారీకున వీరిద్దరి బ్యాంకు ఖాతాల్లోకి ఐఎంఏ నుంచి పెట్టుబడికి సంబంధించిన లాభం బదిలీ అయ్యేది. దీంతో వీరికి పూర్తి నమ్మకం కలిగి తమ కుమార్తె, కుమారుల్ని ప్రోత్సహించి వారితోనే పెట్టుబడులు పెట్టించారు. ఇలా వీరి కుటుంబమే మొత్తం రూ.38.5 లక్షలు పెట్టుబడిగా పెట్టగా... వీరికి పరిచయస్తుడైన సికింద్రాబాద్‌కు చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి గులాం గౌస్‌ మరో రూ.9.51 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. బెంగళూరులో ఐఎంఏపై కేసు నమోదు కావడంతో వీరంతా పునరాలోచించుకున్నారు. ఈలోపు దుబాయ్‌కి పారిపోయిన దాని నిర్వాహకుడు, ప్రధాన సూత్రధారి మన్సూర్‌ ఖాన్‌తో పాటు 22 మందిని బెంగళూరుకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. దీంతో మహ్మద్‌ మక్సూద్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యులు, గౌస్‌ ఇటీవల హీరా గ్రూప్‌ విక్టిమ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎంఐఎం నేత షాబాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను సంప్రదించారు. ఆయన సూచనల మేరకు బాధితులు సీపీ అంజనీకుమార్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. కొత్వాల్‌ సిఫార్సుతో మంగళవారం సీసీఎస్‌ పోలీసులు ఐఎంఏపై కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన మరో 12 మంది బాధితులు సైతం పోలీసులకు ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఐఎంఏ సూత్రధారి మన్సూర్‌ ఖాన్‌ సహా మిగిలిన నిందితుల్ని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకురావాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న మహ్మద్‌ మక్సూద్‌ అహ్మద్‌ 2012–13లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇంటర్మీడియట్‌ హిందీ పాఠ్యపుస్తకం రాసిన బృందంలో ఒకరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement