
బండ్‌బారుతోంది!
- పూడికతో నిండుతున్న ‘సాగర్’
- మొక్కుబడిగా ప్రక్షాళన
- బాధ్యత తీసుకోని యంత్రాంగం
- భారీగా చేరుతున్న వ్యర్థాలు
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ హిత వినాయకుని తయారు చేయాలని పిలుపునివ్వడం మినహా పక్కాగా ఆంక్షలు విధించలేని ప్రభుత్వ నిస్సహాయత చారిత్రక హుస్సేన్‌సాగర్‌ను కాలుష్య కాసారంలా మార్చేసింది. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా... అనుకున్న స్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతం కాలేదు. స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు.
పీఓపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో రూపుదిద్దుకున్న గణనాథుడి భారీ విగ్రహాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. గత సంవత్సరం కంటే అధికంగానే పీఓపీ వినాయక విగ్రహాలు సాగర్‌లో నిమజ్జనమయ్యాయి. కృత్రిమ రంగులతో కూడిన భారీ వినాయక విగ్రహాలు అధిక సంఖ్యలో నిమజ్జనం కావడంతో హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం రెట్టింపైనట్లు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చిన్నా పెద్దవి కలిపి 50-55 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 65 వేలకు పెరిగింది. సాగర్ నుంచి వెలికి తీస్తున్న వ్యర్థాల పరిమాణం కూడా అంతే స్థాయిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
గత ఏడాది సాగర్ నుంచి 3,723 టన్నుల నిమజ్జన వ్యర్థాలను వెలికి తీయగా, ఈసారి అది 5వేల టన్నులకు పైగా ఉండొచ్చని అధికారుల అంచనా. ఓ వైపు హెచ్‌ఎండీఏ రూ.370 కోట్ల వ్యయంతో సాగర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్టు చెబుతోంది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి విష రసాయన పదార్థాలతో నిర్మితమైన గణేశ్ విగ్రహాలు వేల సంఖ్యలో వచ్చి చేరాయి. వీటిని వెలికితీసే కార్యక్రమం మాత్రం మొక్కుబడిగా సాగుతోంది.
ఒకవైపే శుద్ధి
నిజానికి సాగర్‌లో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. అటుగా వెళ్లే ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టిలో పడితే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో వాటిని తొలగించేందుకే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. అదే ట్యాంక్‌బండ్ వైపు అయితే.... లోతు ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లలో పడిన విగ్రహాల ఆచూకీ తెలియట్లేదు. ఒక్కరోజు నీటిలో నానితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కరిగిపోతుండటంతో వ్యర్థాలు సాగర్ గర్భంలోకి చేరుతున్నాయి. ఇలా ట్యాంక్‌బండ్ వైపు కొన్నేళ్లుగా పూడిక పేరుకుపోతోంది. అటువైపు నిర్వహణ తమకు సంబంధం లేదని హెచ్‌ఎండీఏ, నీళ్లున్న ప్రాంతం తమ పరిధిలోకి రాద ని జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులు ఎవరికివారు తప్పించుకుంటూ ఉండడంతో ట్యాంకు బండ్ భద్రతకు భరోసా లేకుండా పోయింది.
అంత పరిజ్ఞానం లేదట...
వినాయక నిమజ్జనోత్సవానికి భారీ మొత్తం ఖర్చు చేసిన జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను వెలికితీసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. లోతైన ప్రాంతం కావడంతో అటువైపు పూడిక తొలగింపు అంత సులభం కాదని, ఆ పరిజ్ఞానం కూడా తమ వద్ద లేదంటూ అధికారులు కొన్నేళ్లుగా దాటవేస్తూ వస్తున్నారు. పైపైన తేలిన విగ్రహాలను డీయూసీ, బోట్ల ద్వారా గట్టుకు చేరుస్తున్నారే తప్ప, అడుగుకు చేరుకున్న వాటి జోలికి వెళ్లట్లేదు. విగ్రహాలు కొన్నిరోజులు నీటిలో నానితే ఔట్ ఫ్లోలో కొట్టుకుపోతాయంటూ కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నారు.
మరోవైపు ట్యాంక్‌బండ్ వైపు నిర్వహణ మొత్తం జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ విభాగాల పరిధిలో ఉండటంతో అటువైపు పూడికతీత పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా సాగర్ ఉనికికే ప్రమాదం వాటిల్లిందన్న విషయం సుస్పష్టం. అసలు లోపాన్ని చక్కదిద్దకుండా సాగర్ ప్రక్షాళన పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేయడం ఎంతవరకు సబబో సర్కార్‌కే తెలియాలి.
అయ్యో.... గణేశా!
సాక్షి, సిటీ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంత భక్తిశ్రద్ధలతో చేస్తారో... అంతే భక్తి ప్రపత్తులతో గణేశ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఎటొచ్చీ నిమజ్జనానంతరం జరుగుతున్న తంతుభక్తుల మనస్సులను గాయపరుస్తోంది. 11 రోజుల పాటు నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ భారీ గణేశుడు ఇప్పుడు ముక్కలు చెక్కలుగా విడిపోయి ‘సాగర్’ తీరంలో కనిపిస్తుండడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. వినాయకుడు పూర్తిగా నిమజ్జనం కాకుండా సాగర్ ఒడ్డునేఅవశేషాలు ఉండడంతో దీన్ని చూస్తున్న జనం అధికారుల తీరును తప్పు పడుతున్నారు.
పనులు వేగిరం: కమిషనర్
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన పూడికతీత పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగర్‌లో వినాయక విగ్రహాల తొలగింపు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడిన విగ్రహాల వ్యర్థాలను సత్వరం గట్టుకు చేర్చాలని, లేదంటే అవి కరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. నిత్యం ప్రముఖులు రాకపోకలు సాగించే ఎన్టీఆర్ మార్గ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా పనులు నిర్వహించాలని బీపీపీ ఓఎస్‌డీ వి.కృష్ణకు సూచించారు.
నిమజ్జనం వ్యర్థాలు 2322 మెట్రిక్ టన్నులు
సాక్షి, సిటీబ్యూరో: గణేశనిమజ్జనం సందర్భంగా జీహెచ్‌ఎంసీలో 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ కార్మికులు తరలించారు. గ్రేటర్‌లో రోజుకు సగటున 3,800 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, నిమజ్జనం సందర్భంగా ఈనెల 7,8, 9,10 తేదీల్లో అదనంగా 2,322 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీన 849 మెట్రిక్ టన్నులు, 8న 321, 9న 482.5, 10న 670 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తరలించారు.