
డిజిటల్ విప్లవం ముంగిట్లో భారత్
కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఆర్.ఎస్.శర్మ
{పజలందరికీ డిజిటల్ లాకర్లు
ఇండియా జియోస్పాటియల్ ఫోరం ప్రారంభం
హైదరాబాద్: భారతదేశం డిజిటల్ విప్లవం ముంగిట్లో ఉందని, సమీప భవిష్యత్తులోనే ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా దేశ పౌరులందరికీ వినూత్నమైన సేవలు అందించనున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ఆధార్ ఆధారిత డిజిటల్ సంతకం, వ్యక్తిగత ధ్రువపత్రాలన్నింటినీ నిక్షిప్తం చేసుకునేందుకు ప్రజలందరికీ డిజిటల్ లాకర్‌లు ఏర్పాటు చేయడం ఈ ప్రయత్నాల్లో భాగమేనని ఆయన చెప్పారు. మొత్తంగా ప్రభుత్వ సేవల తీరుతెన్నులే మారిపోతాయన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో మంగళవారం ప్రారంభమైన ఇండియన్ జియోస్పాటియల్ ఫోరమ్ 17వ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ కార్యక్రమాల్లో జియోస్పాటియల్ ఇన్ఫర్మేషన్(జీఐఎస్) అత్యంత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
దాదాపు 75 కోట్ల ఆధార్ కార్డులు, 90 కోట్ల సెల్‌ఫోన్ వినియోగదారులు, 13.5 కోట్ల జన్‌ధన్ యోజన లబ్ధిదారుల రూపంలో భారత్‌లో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. వీటితోపాటు ప్రభుత్వం డిజిటల్ సంతకాల సేకరణకు, ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకునేందుకు డిజిటల్ లాకర్లను ఏర్పాటు చేయనుందని తెలిపారు. జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో భూ రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చకపోవడం వల్ల అనేక ఇబ్బందులొస్తున్నాయన్నారు. పట్టణాలు, నగరాల ప్లానింగ్ మొదలుకుని, వ్యర్థాలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, గుర్తింపు తదితర అనేకాంశాల్లో ఎంతో ఉపయోగమున్న జీఐఎస్ టెక్నాలజీని అన్ని రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని చెప్పా రు. కేంద్ర ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేష్ నాయక్, ఎల్ అండ్ టీ, రోల్టా ఇండియా సీఈవోలు కె.వెంకటరమణన్, కె.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు.