‘ఓటుకు నోటు’లో ఇద్దరు సీఎంలు దోషులే
వరంగల్ అర్బన్/హన్మకొండ : ఓటుకు నోటు వ్యవహరంలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ దోషులేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండ నయూంనగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోలేకపోతున్నారన్నారు. రాజ్యాం గాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. రాష్ట్రంలో దేవాలయాల వద్దకు విస్తృత పర్యటనలు చేస్తున్న కేసీఆర్ మసీదులు, చర్చిల వద్దకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
అండర్‌డ్రైనేజీ కోసం ఉద్యమిస్తాం వరంగల్ నగరంలో అండర్‌డ్రైనేజీ కోసం ప్రజ లతో కలిసి ఉద్యమం చేస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీ గార్డెన్‌లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల పర్యటనలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరమని, తమ పార్టీకి అధికారం ఇస్తే వంద రోజుల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడ్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఏడాది గడిచినా అండర్ డ్రైనేజీ ఊసెత్తడం లేదని విమర్శించారు. ప్రత్యేకంగా దళితమంత్రిని నియమించి దళిత సంక్షేమ శాఖను అప్పగించాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రమేష్ మాదిగ, సభ అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్ మాదిగ, జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, నాయకులు వేల్పుల వీరన్న, నకిరకంటి యాకయ్య, పుట్ట రవి, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఈర్ల కుమార్, మహిళ నేతలు సింగిరెడ్డి కృష్ణ, దామెర కరుణ, తూర్పు నాయకులు సింగారపు చిరంజీవి, ప్రమోద్ పాల్గొన్నారు.