సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతున్నాయి. ఓ వైపు డిస్కంల ఆర్థికలోటు ఏడాదికేడాది పెరిగిపోతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు విద్యుత్ రాయితీలు కేటాయించడం లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎదురైన విద్యుత్ సంక్షోభాన్ని డిస్కంలు కేవలం 6 నెలల్లోనే అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాయి. దీనికితోడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం మేరకు గతేడాది జనవరి 1 నుంచి వ్యవసాయానికి ఉచిత్‌విద్యుత్ సరఫరా పథకాన్ని 9 గంటల నుంచి 24 గంటలకు పొడిగించాయి. ఈ చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి రావడంతో డిస్కంలపై ఆర్థికభారం పెరిగిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి కంపెనీలకు బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లించడంలో డిస్కంలు చేతులెత్తేస్తున్నాయి.
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.1,356 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని జాతీయ థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థ(ఎన్టీపీసీ) గతనెలలో హెచ్చరికలు జారీ చేసింది. మరో ప్రైవేటు కంపెనీకు సైతం రూ.1,000 కోట్ల వరకు బకాయిలను డిస్కంలు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు పెంచి ఆదుకుంటుందని డిస్కంల యాజమాన్యాలు ఆశించాయి. తాజాగా శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అరకొరగా విద్యుత్ రాయితీ నిధులు కేటాయించడంతో విద్యుత్ సంస్థలు తీవ్ర నిరాశకు గరయ్యాయి. విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
కొంప ముంచిన ఈఆర్సీ లెక్కలు
ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతేడాది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్)లో డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యుత్ రాయితీ నిధులతో కొంతవరకు ఆర్థికలోటు భర్తీ కానుండగా, మిగిలినలోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. విద్యుత్‌చార్జీల పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2018–19 రాష్ట్ర బడ్జెట్‌లో సైతం డిస్కంలకు ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు మాత్రమే కేటాయించింది.
ఈ క్రమంలో ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన ఈఆర్సీ డిస్కంల ఆర్థికలోటు అంచనాలను రూ.5,980 కోట్లకు కుదించి పాతచార్జీలతోనే వార్షిక టారిఫ్ ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెలతో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా, ఇప్పటికే డిస్కంలు రూ.5 వేల కోట్లకుపైగా ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నాయని ట్రాన్స్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత చార్జీలనే వచ్చే ఏడాది కొనసాగిస్తే 2019–20లో డిస్కంలు రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థికలోటును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019–20లో విద్యుత్‌శాఖకు రూ.4,002 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ నిధులు కలుపుకున్నా విద్యుత్ రాయితీలు రూ.5 వేల కోట్లకు మించవని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.5 వేల కోట్లకుపైగా ఆర్థికలోటులో కొంతభాగాన్ని అయినా పూడ్చుకోవడానికి విద్యుత్‌చార్జీల పెంపు తప్పదని చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చే జూన్‌లో విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించే అవకాశాలున్నాయి.
విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమే!
Published Mon, Feb 25 2019 2:18 AM | Last Updated on Mon, Feb 25 2019 2:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment