సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం, వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్‌కు 70,054 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 150.74 టీఎంసీలకు పెరిగి.. నీటిమట్టం 520.8 అడుగులకు చేరుకుంది.
మరో 70 అడుగుల మేర (162 టీఎంసీలు) నీళ్లు వస్తే సాగర్ పూర్తిగా నిండుతుంది. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులోకి 7,536 క్యూసెక్కులు నీరు చేరుతుండటంతో నీటి నిల్వ 11.64 టీఎంసీలకు చేరుకుంది.
సోమవారం జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన 44 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలు, సుంకేసుల బ్యారేజీ నుంచి విడుదల చేసిన 13,437 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి 57,437 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 12 టీఎంసీలు వస్తే శ్రీశైలం జలాశయం నిండనుంది.
Comments
Please login to add a commentAdd a comment