
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతికి ఈ విమానం వెళ్లాల్సి ఉంది.
ఉదయం 6.25 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం.. గాలిలోకి ఎగిరిన 15 నిమిషాలకే సాంకేతిక లోపంతో తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 గంటలు కావొస్తున్నా.. ఇప్పటివరకు విమానాశ్రయంలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో గమ్యానికి ఎలా చేరుకోవాల తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.