- పలు గ్రామాల్లో రూ.లక్షల్లో అవినీతి
- విద్యార్థుల ఉపకార వేతనాల నిధులు దుర్వినియోగం
- మహిళలకు రుణాల పేరిట సిబ్బంది వసూళ్ల పర్వం
- పట్టించుకోని ఉన్నతాధికారులు
యాచారం: ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) అక్రమాలకు మరోపేరుగా మారింది. రూ. లక్షల నిధులు పక్కదారి పడుతున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఇద్దరు ఐకేపీ మండల అధికారులు, పలువురు క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు వేసినా అక్రమాల పుట్టను మాత్రం ఉన్నతాధికారులు పూర్తిగా కదిలించలేకపోతున్నారు. ఇదంతా షరామామూలుగానే భావిస్తున్న ఐకేపీ ఉద్యోగులు నిరుపేద మహిళలకు చెందిన నిధులను కాజేస్తున్నారు.
పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు పురోగతిలో విఫలం కావడంతో తీసుకున్న అప్పులు చెల్లించక, చెల్లించిన అనంతరం బకాయిలు అలాగే ఉండడంతో కంగారుపడుతున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, పాడిపరిశ్రమ, పావలా వడ్డీ రుణాలు, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ నిధుల్లో రూ. లక్షల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేకుండాపోయారు.
ఐకేపీ సిబ్బంది అవినీతి చిట్టా ఇదీ.. మండలంలోని గడ్డమల్లయ్యగూడలో 15 గ్రూపులకు మంజూరైన రూ. 76 లక్షల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు, ఐకేపీ సిబ్బంది ఒక్కో సంఘం నుంచి రూ. 8 నుంచి రూ.10 వేలకు పైగా వసూలు చేసినట్లు రెండు నెలల క్రితం ఆ గ్రామ సర్పంచ్ మల్లేష్ స్వయంగా ఎంపీడీఓ ఉషకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన సీసీ పర్యవేక్షణలోనే వసూలు చేసినట్లు ఫిర్యాదు చేసిన ఇప్పటికీ విచారణ జరగలేదు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు.
చింతుల్లలో 2011-12కు సంబంధించి 180 మంది విద్యార్థులకు చెందాల్సిన ఉపకార వేతనాలు రూ. 2 లక్షల 16 వేలను కొంతమంది అర్హతలేని వారికి, ఉద్యోగులకు మంజూరు చేసినట్లు అప్పట్లో సామాజిక తనిఖీ సిబ్బంది నిగ్గుతేల్చారు. కాని అధికారుల నిర్లక్ష్యం కారణంగా మళ్లీ 2011-12 జాబితా ప్రకారమే 2012-13లో కూడా ఉపకార వేతనాలు మంజూరు చేశారు. ఇప్పటికీ ఆ నిధులు రికవరీ కాలేదు. మహిళా సంఘాల అధ్యక్షులను తొలగించారు కాని పర్యవేక్షణలో విఫలమైన సీసీని మాత్రం తొలగించలేదు.
గునుగల్, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లోనూ దాదాపు 50 మందికిపైగా బోగస్ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేసినట్లు అప్పట్లో సామాజిక తనిఖీ సిబ్బంది తేల్చారు. ఇప్పటికీ ఆ నిధులు రికవరీ చేయలేదు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు.
నల్లవెల్లి, చింతుల్ల గ్రామాల్లో మహిళలకు పాల ప్రగతి కేంద్రాల కింద పాడిపశువుల కొనుగోలు కోసం రూ. 10 లక్షలకుపైగా రుణాలిచ్చారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆ పథకం పూర్తిగా గాడితప్పింది. కొంత మంది పాడి పశువులు కొనుగోలు చేయలేదు. నిధుల మంజూరు అనంతరం పర్యవేక్షణ లేకపోవడంతో మహిళల ఆర్థిక పరిపుష్టి పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.
మొండిగౌరెల్లిలో ఐదేళ్ల క్రితం గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహిళల ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బంది పర్యవేక్షణ చేసి కేంద్రం ఏర్పాటు కోసం బ్యాంకులో తీసుకున్న అప్పులు చెల్లించాల్సి ఉంది. కాని అధికారులు పట్టించుకోకపోవడం వల్ల బ్యాంకు అధికారులు అప్పులిచ్చినట్లే ఇచ్చి బలవంతంగా ఒక్కో సంఘం నుంచి రూ. 5వేల వరకు వసూలు చేశారు. అప్పట్లో మహిళలు ప్రతిఘటించినా ఫలితం లేదు.
యాచారంలో ఓ మహిళా సంఘానికి చెందాల్సిన రూ. 10 లక్షలకుపైగా స్త్రీనిధి డబ్బులను మరో సంఘంవారు డ్రా చేశారు. దీనిపై సదరు మహిళలు ప్రశ్నించినా ఐకేపీ ఉద్యోగులు పట్టించుకోలేదు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, ఆడిట్ సిబ్బంది తనిఖీలు చేయడం వంటి చర్యలకే పరిమితమైన అధికారులపై డ్వాక్రా సంఘం మహిళల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అయ్యవారిగూడెంలో కూడా ఇదే మాదిరి తప్పిదం జరిగింది. చౌదర్‌పల్లిలో ఐదేళ్ల క్రితం అప్పటి ఉద్యోగి బినామీ పేర్లపై స్వాహా చేసిన రూ. లక్షకుపైగా నిధులు ఇప్పటికీ రికవరీ చేయలేదు.
రెండేళ్లు దాటినా..:
సత్యపాల్, సర్పంచ్, చింతుల్ల
గ్రామంలో విద్యార్థులకు చెందాల్సిన ఉపకార వేతనాల్లో అవకతవకలు జరిగినట్లు అప్పట్లో స్వయంగా సామాజిక తనిఖీ సిబ్బందే నిగ్గుతేల్చారు. కానీ ఇప్పటివరకు నిధులను రికవరీ చేయలేదు. 2012-13లోనూ పాత పేర్ల వారికి ఉపకార వేతనాలు మంజూరు చేసినట్లు తెలిసింది. ఐకేపీ అధికారులు పర్యవేక్షణ సక్రమంగా లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలి. నిధులు రికవరీ చేయాలి. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకో వాలి.
కఠిన చర్యలు తప్పవు:
రాందాసు, ఐకేపీ ఏపీఎం, యాచారం
తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. గడ్డమల్లయ్యగూడలో సంఘాల నుంచి కమీషన్లు వసూలు చేసిన విషయమై విచారణ చేస్తున్నాం. ఉపకార వేతనాల పంపిణీలో చింతుల్లతో పాటు గునుగల్, గడ్డమల్లయ్యగూడ, మొండిగౌరెల్లి తదితర గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు తేలింది. నిధుల రికవరీ చేయాలని ఆయా గ్రామాల సీసీలను ఆదేశించాను.
అక్రమాల ‘ఐకేపీ'
Published Mon, Apr 27 2015 12:19 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement