
మనోహరాబాద్‌లోని పారిశ్రామికవాడ
సాక్షి, మెదక్ : మెదక్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు స్థల సేకరణ అంశం కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో తూప్రాన్ ప్రాంతంలో మాత్రమే ప్రస్తుతం పరిశ్రమలు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్ ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు లేవు.
ఇక్కడి యువతకు సరైన ఉపాధి అవకాశాలు లభించడం లేదన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మెదక్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశ్రమలవాడ ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ఈ అంశంపై ఎప్పటికప్పుడు రెవెన్యూ, పారిశ్రామిక శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో మెదక్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు మెదక్ నియోజకవర్గంలో అనువైన వనరులు ఉండటం, రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం, రెండు జాతీయ రహదారులు ఇక్కడ ఉన్న విషయాన్ని పారిశ్రామికవేత్తలకు తెలియజేసి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు.
అధికారుల అన్వేషణ
మెదక్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు సైతం ఆశిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఇక్కడి యువతకు ఉపాధి లభించటంతోపాటు అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా జిల్లా యంత్రాంగం రూపలకల్పన చేస్తోంది. ఇప్పటికే అనువైన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు.
మెదక్ మండల పరిధిలో 50 నుంచి 100 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే చేగుంట మండలంలో సైతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రతిపాదనలను మెదక్ ఆర్డీఓ నగేశ్ ఇటీవలే కలెక్టర్‌కు అందజేసినట్లు సమాచారం. మెదక్ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కులో ఆటోమొబైల్, ఆగ్రో కంపెనీలు పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే చేగుంట ప్రాంతంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కులో ఫార్మా కంపెనీలు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారికి చేగుంట దగ్గరగా ఉండటం ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నట్లు సమాచారం.
యువతకు ఎంతో మేలు
మెదక్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో కలెక్టర్ ధర్మారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అనువైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూములు గుర్తింపు ప్రక్రియ ఈనెలాఖరుకు కొలిక్కివచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ పూర్తి అయితే పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది.
–రత్నాకర్, జీఎం డీఐసీ
Comments
Please login to add a commentAdd a comment