నాసిరకం మందులపై సీరియస్
* విచారణకు ఆదేశించిన సీఎస్ రాజీవ్ శర్మ
* త్వరలో టీఎస్ ఎంఎస్‌ఐడీసీ ఎండీనియామకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాసిరకం మందులతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్న తెలంగాణ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎంఎస్‌ఐడీసీ) అధికారులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ విచారణకు ఆదేశించారు. ఈ నెల 15న ‘నాసిరకం మందులకు రాజముద్ర’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన సీఎస్.. తక్షణమే మందుల కొనుగోలుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన మందులపై పరీక్షలు నిర్వహించారా..? లేదా..? నిర్వహిస్తే వాటి నివేదికలు కూడా సమర్పించాలని సూచించారు. కాగా, తమ బండారం బయటపడకుండా నివేదికలు తారుమారు చేసేందుకు టీఎస్ ఎంఎస్‌ఐడీసీ అనాలసిస్ విభాగంలోని కొందరు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
ఇదిలావుంటే ప్రస్తుతం టీఎస్ ఎంఎస్‌ఐడీసీకి ఎండీగా.. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఈ బాధ్యతలు అదనంగా ఉండటంతో రోజువారీ పర్యవేక్షణ కొరవడుతోంది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో తక్షణమే పూర్తిస్థాయి ఎండీని నియమించాలని సర్కారు యోచిస్తోంది.
యాంటీబయాటిక్స్‌లో వసూళ్ల పర్వం..
తెలంగాణలో యాంటీబయాటిక్స్ మందులు సరఫరా చేసే వారి నుంచి సంబంధిత విభాగాల అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. యాంటీబయాటిక్స్ సేకరణ (ప్రొక్యూర్‌మెంట్) చూసే ఓ ఫార్మసిస్ట్ 2 శాతం కమీషన్ ఇస్తేనే ఆర్డరు ఇస్తామని నిక్కచ్చిగా చెబుతున్నారు. అలాగే, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లుగా విధులు నిర్వహించాల్సిన కొందరు టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో పనిచేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ఉన్నతాధికారుల అండతో సదరు ఫార్మసిస్టులు లాభసాటిగా ఉంటోందని టీఎస్ ఎంఎస్‌ఐడీసీలో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. వీళ్లపై వైద్యవిధానపరిషత్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీనిపైనా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.