వినతుల వెల్లువ
కరీంనగర్ సిటీ : అల్పాహారానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు వివిధ వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. అప్పటికే వేచి ఉన్న జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, జేఏసీ, ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్‌ను చుట్టుముట్టి వినతిపత్రాలు అందచేశారు. బెయ్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న తమను ఆదుకోవాలని జగిత్యాలకు చెందిన లక్కరాజు రమణ దంపతులు కేసీఆర్‌ను కలిసి వేడుకున్నారు. వెంటనే స్పందించిన కేసీఆర్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ సంజయ్‌కుమార్‌ను పిలిచి, వీరిని వెంటపెట్టుకొని హైదరాబాద్ తీసుకురావాలంటూ పురమాయించారు.
ఉద్యమంలో ముందున్న తమను, ఇప్పుడు అధికారం వచ్చాక ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మహిళానేతలు వరాల జ్యోతి, సిగిరి శోభలు ఫిర్యాదు చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటున్న శోభను ఓదార్చిన కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చి తనను కలవమని సూచించారు. కమలనాథన్ విభజన చట్టంలో భాగంగా ఏపీ ఉద్యోగులను తెలంగాణలో కేటాయించడం ద్వారా ఉద్యాన, సూక్ష్మసేధ్య శాఖ ల్లోని తెలంగాణ అధికారులకు బదిలీలు,పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని, ఈ అలాట్‌మెంట్‌ను నిలిపివేయాలని హార్టికల్చర్ డీడీ సంగీతలక్ష్మి, ఏడీ జ్యోతి విజ్ఞప్తిచేశారు.
జిల్లాలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని, స్టేడియంల అభివృద్ధికి నిధులు కేటాయించాలి, స్పోర్ట్స్‌స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేయాలని డీఎస్‌డీవో సత్యవాణి సీఎంను కోరారు. కాగా, తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు జెడ్పీటీసీలు అసంతప్తి వ్యక్తంచేశారు. గ్రానైట్ వ్యాపారులను సీఎంను కలిసేందుకు పంపించి, తమను మాత్రం కలవనీయలేదని బాహాటంగానే వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని సీనియర్ కార్యకర్త రెడ్డవేని తిరుపతి, కులసంఘాల చైర్మన్ ఆనంద్ కోరారు.
జూలపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పక్కాభవననిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,పెద్దాపూర్‌చెరువును మినీరిజ ర్వాయర్ చేయాలని, చొప్పదండి నుంచిజూలపల్లికి ఉన్న డబుల్‌రోడ్‌ను పెద్దపల్లికి పొడగించాలని టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.రఘవీర్‌సింగ్ సీఎంను కోరగా,ఆయన సానుకూలంగా స్పందించారు. రంజాన్ వ ూస ప్రారంభాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ హుస్సేన్ కేసీఆర్ చేతికి ఇమామే జామీ కట్టి, శాలువ కప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి దేవాలయానికి సంబంధించిన ప్రసాదాన్ని అర్చకులు అందచేశారు.