* తెలంగాణ వారిని సీమాంధ్రకు పంపే కుట్ర
* వివాదాలు సృష్టిస్తున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్
* టీ-ఎన్జీవోల సంఘం ధ్వజం
* సీఎస్‌కు, కమలనాథన్ కమిటీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో అన్యాయం జరుగుతోందని, తెలంగాణ వారిని కావాలనే సీమాంధ్రకు పంపే కుట్ర జరుగుతోందని టీ-ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, కన్వీనర్ విఠల్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల కమిటీ చైర్మన్ కమలనాథన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
అనంతరం సచివాలయం మీడియా పాయింట్‌లో టీ-ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ఇంటర్మీడియెట్ బోర్డులో మొత్తం 31 సీనియర్ అసిస్టెంట్ పోస్టులుండగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారని వివరించారు. వారిలో ఐదుగురు తెలంగాణ, ఇద్దరు సీమాంధ్రకు చెందిన వారున్నారని తెలిపారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఉద్యోగుల విభజన చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ముగ్గురు సీనియర్ అసిస్టెంట్‌లను తెలంగాణకు, నలుగురిని సీమాంధ్రకు కేటాయించారని, వీరిలో ఇద్దరు తెలంగాణ వారున్నారని వివరించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడిగా పోరాడుతున్న విఠల్‌ను కావాలనే సీమాంధ్రకు కేటాయించేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగా జరగాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యోగులు అధికంగా ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాధ్యమిక విద్యా మండలిలోనూ ఇదే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వారు తెలంగాణ ప్రభుత్వంలో, సీమాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాలే తప్ప.. అక్కడి వారిని ఇక్కడకు, ఇక్కడి వారిని అక్కడకి మార్చితే అంగీకరించే ప్రసక్తే లేదని ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ ఉద్యోగులు మరోసారి పోరాడటానికి సిద్ధమని ప్రకటించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులను కూడా స్థానికత అధారంగా విభజించాలన్నారు.
ఇంటర్మీడియెట్ బోర్డులో తప్పుడు విధానాలతో చేపట్టిన విభజనను తాము తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన దీన్ని తీవ్రంగా పరిగణించారని చెప్పారు. తమపై సీమాంధ్ర ఆధిపత్యాన్ని చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని, రెచ్చగొట్టే విధంగా కేటాయింపులు ఉండరాదని హితవు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతిని కూడా కలిసిన టీ-ఉద్యోగ నేతలు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగుల విభజనలో అన్యాయం
Published Sat, May 24 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement