కొత్త జిల్లాలంటే ఉత్తి లెక్కలు కాదు
పేదలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త జిల్లాలంటే కేవలం లెక్కలు, అంకెలు కాదు.. ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేస్తోందో అర్థం చేసుకోవాలి.. రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లందరిలోనూ ఆ తపన కనిపించాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం జరగాలి.. పేదలకు సేవ చేయాలనే నిబద్ధత, చిత్తశుద్ధితో సన్నద్ధం కావాలి’’ అని సీఎం కేసీఆర్ మంగళవారం జరిగిన కలెక్టర్ల సమీక్షలో వ్యాఖ్యానించారు. ఏ జిల్లాకు ఎంత మంది ఉద్యోగులు అవసరమో ఇప్పటికీ లెక్క తేలకపోవటం, ఏ జిల్లాలో ఎన్ని మంజూరు పోస్టులున్నాయి, ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారనే వివరాలు అందుబాటులో లేకపోవటంపై సీఎం కొందరు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమీక్షలకు వచ్చేటప్పుడు సమగ్రమైన సమాచారంతో రావాలన్నారు.
సీఎం ఆశించిన మేరకు సమాచారం అందుబాటులో లేకపోవటం, ఉద్యోగుల కేటాయింపుపైనే ఇప్పటికీ సందిగ్ధత నెలకొనడంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని హన్మకొండ జిల్లాను రద్దు చేసి వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రెండ్రోజుల కిందటే అధికారులకు సూచించినట్లు తెలిసింది. మంగళవారం నాటి సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు రాకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని ఆన్‌లైన్‌లో వేల సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నాయని చర్చకు వచ్చినప్పుడు.. అవన్నీ కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని, పట్టించుకోవాల్సిన అవసరమేమీ లేదని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ప్రజల డిమాండ్‌ను బట్టి కొత్త మండలాలు అవసరముంటే రెండ్రోజుల్లోనే ప్రతిపాదనలు పంపించాలన్నారు.
అలాగే పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాలు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. త్వరలోనే మరోమారు సమావేశమై పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సందేహాలు, సమస్యలన్నీ నివృత్తి చేసుకుందామని చెప్పారు. ఉద్యోగుల విభజన పూర్తయిన శాఖలన్నీ జిల్లాల వారీగా ఆ సమాచారాన్ని సంబంధిత విభాగాలకు పంపించాలని, ఉద్యోగులను ఎక్కడికి కేటాయించారో సీజీజీ ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపరచాలన్నారు. నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో సంబంధిత విభాగాధిపతులు ఉద్యోగులకు వర్క్ టు ఆర్డర్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సర్వీసు రికార్డులు ప్రస్తుత జిల్లా కేంద్రంలోనే ఉంచాలని, స్కానింగ్ చేయించిన ప్రతులను వారికి కేటాయించిన కొత్త జిల్లాలకు పంపించాలని కలెక్టర్లకు సూచించారు.