గులాబీలో డిష్యుం డిష్యుం!
- వీధికెక్కిన ‘పట్నం’రాజకీయాలు
- రెండుగా చీలిన టీఆర్‌ఎస్
- మంచిరెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు
- వైరివర్గాలతో జతకట్టిన ఎంపీ బూర
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా గులాబీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి గ్రూపు వీధికెక్కింది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ రచ్చకెక్కింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధికార పార్టీలో రాజకీయం వేడెక్కింది. నాలుగు నెలల క్రితం మంచిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీలో లుకలుకలకు దారితీసింది. అప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మరో సీనియర్ నేత ఈసీ శేఖర్‌గౌడ్ ఈ పరిణామంతో డీలా పడ్డారు.
ఈ క్రమంలోనే ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో కంచర్ల పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆయన వర్గీయులను కూడా తనవైపు తిప్పుకునేందుకు మంచిరెడ్డి అనుసరిస్తున్న వైఖరితో గుస్సా మీద ఉన్న ఆయన ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈసీ శేఖర్‌గౌడ్ ఏకంగా విలేకర్ల సమావేశం పెట్టి మరి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలను సంధించారు. భూ అక్రమాలకు పాల్పడుతూ పార్టీ విలువలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలను అణగదొక్కుతున్నారని విమర్శించారు.
నావేలితో నాకన్నే పొడిపించారు
మరోవైపు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కూడా ఎమ్మెల్యే వైఖరిపై కినుక వహించినట్లు తెలిసింది. వైరివర్గాలకు అనుకూలంగా మాట్లాడిన తీరు ఆయన అసమ్మతిని బయటపెట్టింది. భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వ స్థాయిలో నేను మాట్లాడితే.. మరొకరు చెక్కులను పంపిణీ చేయడమేమిటనీ’ ఆయ న ఇబ్రహీంపట్నంలో విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా ‘రాజకీయాల్లో నేనొక అజ్ఞానినని, నా వేలితోనే నా కంటిని పొడిపించిన మేధావులు ఇక్కడి వారని’ పరోక్షంగా మంచిరెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం చూస్తే ‘పట్నం’ లో గ్రూపురాజకీయాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ వర్గీయుడిగా గుర్తింపు పొందిన ఈసీ శేఖర్‌గౌడ్ విలేకర్ల సమావేశం పెట్టడం చర్చకు తెరలేపింది.
మహేందర్‌తో కంచర్ల భేటీ
ఇదిలావుండగా, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితో బుధవారం చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అ య్యారు. ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించిన చంద్రశేఖర్‌రెడ్డి.. తనవర్గీయులకు జరుగుతు న్న అన్యాయంపై ఏకరువు పెట్టినట్లు తెలిసిం ది. మంచిరెడ్డితో ముందు నుంచి అభిప్రాయబేధాలున్న మహేందర్.. ఈ అంశంపై లోతు గా వెళ్లకుండా.. పరిస్థితులను చక్కదిద్దుతానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదిలావుండగా, మంచిరెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. ఈ మేరకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిసింది.