
‘పురుగుల సెలైన్’ ఘటనపై విచారణ కమిటీ
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారికి పురుగులున్న సెలైన్ ఎక్కించిన ఘటనపై విచారణ చేపట్టేందుకు త్రిసభ్య కమిటీని నియమించి నట్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ జేవీ రెడ్డి తెలిపారు. జనగాం జిల్లా కొండకండ్ల మండలం మైదం చెరువుతండాకు చెందిన ఆరేళ్ల సాయిప్రవళిక ఈ నెల 7 నుంచి గాంధీ ఆస్పత్రి పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(పీఐసీయూ)లో చికిత్స పొందుతోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పురుగుల అవశేషాలు ఉన్న సెలైన్ బాటిల్‌లోని ద్రావణాన్ని ఎక్కిం చడంతో పాప ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిన సంగతి విదితమే.
ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు పిడియాట్రిక్ హెచ్‌వోడీ జేవీరావు, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ రాజారావు, మైక్రోబ యాలజీ హెచ్‌వోడీ నాగమణిలను నియమిం చినట్లు సూపరింటెండెంట్ జేవీరెడ్డి శుక్రవారం తెలిపారు. వీరు అందించే నివేదిక ఆధారంగా బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీ ఆస్పత్రి పీఐసీయూలో చికిత్స పొందుతున్న సాయిప్రవళికను, ఆమె కుటుంబసభ్యులను శుక్రవారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ పరామర్శించారు.
శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దయాకరరావు మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉందని రుజువైతే వారిపై చర్యలు తప్పవన్నారు. సాయిప్రవళికు ప్రభుత్వ ఖర్చుతో మరింత మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతుందని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ ఆవేదన వ్యక్తం చేశారు.