మండల పరిధిలోని మల్కాపూర్ గని కార్మిక సంఘం కార్యకలాపాలపై విచారణ మొదలైంది. ప్రభుత్వం మల్కాపూర్ సొసైటీకి 30 ఏళ్ల క్రితం సర్వే నంబర్ -15లో దాదాపు 300 ఎకరాలు కేటాయించింది.
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని మల్కాపూర్ గని కార్మిక సంఘం కార్యకలాపాలపై విచారణ మొదలైంది. ప్రభుత్వం మల్కాపూర్ సొసైటీకి 30 ఏళ్ల క్రితం సర్వే నంబర్ -15లో దాదాపు 300 ఎకరాలు కేటాయించింది. కొంత కాలం కిత్రం ఈ భూమిలో మైనింగ్ లీజు రద్దయింది. మైనింగ్ లీజు ముగిసినా నాపరాతి గనులు కొనసాగుతున్నాయని సొసైటీ మాజీ సభ్యులు వికారాబాద్‌లోని కో-ఆపరేటివ్ సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే పట్టా భూముల్లోని నాపరాతి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద డబ్బు తీసుకొని నూతన చైర్మన్ ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయంలో సొసైటీ నూతన చైర్మన్ జక్లపల్లి రాములు, మాజీ చైర్మన్ బాలప్ప ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి ఈశ్వరయ్య విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద సొసైటీ సభ్యులు రూ.2 లక్షలు తీసుకున్నారని, నాపరాతి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేస్తున్నా పట్టించుకోవడంలేదని మాజీ సభ్యుడు గోపాల్ విమర్శించారు. రాయల్టీ లేకుండా నాపరాతి లారీకి రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకూ నూతన కార్యవర్గం ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదన్నారు.
దీంతో విచారణకు వచ్చిన అధికారి ఈశ్వరయ్య ఎదుటే మాజీ చైర్మన్ బాలప్ప, నూతన చైర్మన్ రాములు వాగ్వాదానికి దిగారు. బాలప్ప చైర్మన్ ఉన్నప్పుడు రూ.30 వేలు తీసుకోని ప్రైవేట్ భూముల్లోని నాపరాతి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయించారని రాములు ఆరోపించారు. పరిస్థితి చేజారడంతో అధికారి ఈశ్వరయ్య ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేశారు. అంతకు ముందు నాపరాతి వ్యర్థాలు వేసిన ప్రభుత్వ భూమిని అధికారి పరిశీలించారు. మల్కాపూర్ సొసైటీ కార్యకలాపాలకు సంబంధించిన విచారణ పూర్తయిందని, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని ఈశ్వరయ్య వివరించారు.