అంతర్జాతీయ స్థాయిలో.. బౌద్ధ విశ్వవిద్యాలయం! | International level Buddhist University At Nagarjunasagar | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో.. బౌద్ధ విశ్వవిద్యాలయం!

Published Sun, Mar 10 2019 2:45 AM | Last Updated on Sun, Mar 10 2019 11:14 AM

International level Buddhist University At Nagarjunasagar - Sakshi

నాగార్జునసాగర్‌లోని బుధ్దవనం

ఎందుకు సాగర్‌? 
బౌద్ధంలో మహాయాన పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చైనా, సింగపూర్, కంబోడియా, మలేసియా, జపాన్‌.. తదితర దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. మహాయాన పద్ధతిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య నాగార్జునుడంటే.. ఆ దేశాల్లో బౌద్ధులకు ప్రత్యేక ఆరాధన భావముంది. నాగార్జునుడు నివసించిన ప్రాంతం నాగార్జునసాగర్‌ పరిసరాలే కావటంతో ఇక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. నాగార్జునుడి కాలంలో ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించిన విశ్వవిద్యాలయం విలసిల్లింది. అప్పట్లోనే ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. అందుకే చరిత్రకు సరైన గౌరవం ఇవ్వడంతోపాటు నాటి యూనివర్సిటీని పునరుద్ధరించినట్లవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 

నాగార్జునసాగర్‌లో ప్రపంచ స్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ తక్షశిల తరహాలో పెద్ద విశ్వవిద్యాలయం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్న నేపథ్యంలో దీన్ని పునరుద్ధరించేందుకు ఓ ప్రపంచస్థాయి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే యోచన చాలాకాలంగా ఉంది. ఇప్పుడు ఈ కలను నిజం చేసేందుకు మలేసియా ముందుకొచ్చింది. ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం పేరుతో బౌద్ధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీని పనులు వేగంగా సాగుతున్నాయి.

ఈ బుద్ధవనంలోనే ఇప్పుడు మలేషియా ఆర్థికసాయంతో అంతర్జాతీయస్థాయి బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. మలేషియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ గ్రూపు ఇందుకోసం రూ.200 కోట్లను వెచ్చించేందుకు సంసిద్ధత తెలిపింది. డీఎక్స్‌ఎన్‌ గ్రూపు అధినేత, చైనా మూలాలున్న పారిశ్రామిక వేత్త లిమ్‌ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నారు. దాదాపు రూ.200 కోట్లు వ్యయమయ్యే ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ సంస్థ ఇటీవల ప్రతిపాదన అందజేసింది. ప్రాజెక్టు త్రీడీ యానిమేటెడ్‌ చిత్రాన్ని కూడా రూపొందించింది. దీనికి 40 ఎకరాలు అవసరమవుతాయని పేర్కొంది. కావాల్సిన భూమి కేటాయించాలని కోరుతూ బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మలేసియా సంస్థ పనులు ప్రారంభించనుంది.   

సంప్రదాయ విద్య, ఆధునిక మేళవింపు 
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక విద్యాబోధనతో ఈ విశ్వవిద్యాలయం అలరారనుంది. ఓవైపు ఆధునిక విద్యను అందిస్తూనే సంప్రదాయ బోధనకు పెద్ద పీట వేస్తామని బుద్దవనం ప్రత్యేకాధికారి లక్ష్మయ్య తెలిపారు. ఒత్తిడిని జయించటం, సన్మార్గం, సంప్రదాయం, ప్రపంచ శాంతి.. వంటివి ఒంటబట్టే విధంగా విద్యాబోధన ఉంటుందని, బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ పర్యాటకానికి ఇది కొత్త కోణం కల్పిస్తుందన్నారు.  

అత్యాధునిక హంగులతో.. 
- బుద్ధగయలోని ప్రధాన మందిరం నమూనాలోనే ఇక్కడ యూనివర్సిటీ ప్రధాన భవనం రూపుదిద్దుకోనుంది. ఇది 21 అంతస్తుల్లో 6.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. 15 ఎకరాల్లో రూ.147 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తారు. దీనికి నలుదిక్కులా ఒక్కోటి 7 అంతస్తుల్లో.. నాలుగు భవనాలుంటాయి. 
మూడు ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ భిక్షువుల వసతి గృహ సముదాయాలు నిర్మిస్తారు. 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.3.3 కోట్లతో దీన్ని సిద్ధం చేస్తారు. 
యాభై పడకల సామర్థ్యం ఉండే ఆసుపత్రిని రూ.11 కోట్లతో నిర్మిస్తారు. ఇది చాలా ఆధునికంగా ఉంటుంది. 
ఔషధ మొక్కలు, మామిడి మొక్కలతో 8 ఎకరాల్లో పెద్ద తోట పెంచుతారు. 

తైవాన్‌ చేయూతతో! 
బౌద్ధాన్ని అనుసరించే మరోదేశం తైవాన్‌ కూడా నాగార్జునసాగర్‌లో నిర్మాణాలకు ముందుకొచ్చింది. 
20 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ భిక్షువుల పాఠశాలను నిర్మించనుంది. రూ.16.50 కోట్ల వ్యయంతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ భవనం ఉంటుంది. 
దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో ఓ భారీ బౌద్ధ మందిరాన్ని నిర్మిస్తారు. ఇక్కడ 70 అడుగుల ఎత్తుతో ఆచార్య నాగార్జునుడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తారు. 
సైన్స్, మెకానికల్, కార్పెంటరీ శిక్షణతో కూడిన వృత్తి విద్యా కేంద్రం ఉంటుంది. 60 వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.18 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మిస్తారు. 
బెంగళూరుకు చెందిన లోటస్‌ నిక్కో గ్రూపు 5–స్టార్‌ హోటల్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇందుకు రూ.42 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. 
 – సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement