సాక్షి,బూర్గంపాడు,ఖమ్మం: ‘ప్రస్తుతం ప్రజాసేవ పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు. సామాన్యుడు ప్రస్తుతం రాజకీయాలలో పోటీకి దిగే పరిస్థితులు లేవు. డబ్బు లేకపోతే నాయకులను పట్టించుకునే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితి పట్ల ఒకింత బాధకలుగుతోంది’ అని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చందా లింగయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
సాక్షి: నాటికి, నేటికీ రాజకీయాల్లోలో కనిపిస్తున్న మార్పులేమిటి?
చందా: నాడు రాజకీయాలు నిస్వార్థంగా ప్రజాసేవ కోసం మాత్రమే చేసేవారు. నేడు రాజకీయాలు సంపాదన కోసం చేస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయటం, గెలిచిన తరువాత దోచుకోవటం సర్వసాధారణమైంది.
ప్రజాప్రతినిధిగా ఏ విధమైన అభివృద్ధిని చేపట్టారు?
చందా: ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా మారుమూల గ్రామాలలో తాగునీటి వసతులు, రహదారులను అభివృద్ధి చేశాను. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయించి వాటిలో మౌలికవసతుల కల్పించాను. దీంతో మారుమూల గ్రామాలలో అక్షరాస్యత పెరిగింది. రైతులు పంటలు సాగుచేసుకునేందుకు లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు, చెరువులు తవ్వించాను.
మీ అభిమాన రాజకీయ నాయకులెవరు?
చందా: నాకు అత్యంత అభిమాన నాయకులు జలగం వెంగళరావు, డా వైఎస్ రాజశేఖరరెడ్డి
మీరు ప్రజలకు ఇచ్చే సందేశం.. ?
చందా: ఓటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. గుడ్డిగా ఓట్లు వేయవద్దు. తాత్కాలిక ప్రయోజనాలు, లబ్ధికాకుండా భవిష్యత్‌లో జరగాల్సిన అభివృద్ధి, సంక్షేమంపై ఆలోచన చేయాలి. ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుందో, ఏ అభ్యర్థి నిస్వార్థంగా సేవలను అందిస్తాడో గమనించాలి. డబ్బు, మద్యానికి ఓట్లు అమ్మవద్దు.
మరి మీరు పోటీ చేయకుండా, మీ తనయుడికి అవకాశమిచ్చారు..?
చందా: 1985లో కాంగ్రెస్ నుంచి బూర్గంపాడు లో ఎమ్మెల్యేగా గెలిచాను. 2001 నుంచి 2006 వరకు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశాను. నా రాజకీయ జీవితం విలువలతో కూడుకున్నది. చిన్నతనం నుంచి నేను చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను దగ్గర్నుంచి చూసిన నా కుమారుడు డాక్టర్ చందా సంతోష్‌కుమార్ రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రజాసేవ పట్ల అతనికి ఉన్న బలమైన కోరికను కాదనలేక ప్రోత్సహిస్తున్నాను.
ఉన్నత విద్యను అభ్యసించిన మీరు ఉద్యోగం చేయకుండా.. రాజకీయాలను ఎంచుకోవడానికి కారణం..?
చందా: నేను 1970లోనే ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేశాను. చదువు కోసం చిరుమళ్ల నుంచి బూర్గంపాడుకు ఎన్నోసార్లు కాలినడకన వెళాలను. కాలినడకన రెండురోజులు పట్టేది. నాటి ఆదివాసీల దుర్భరమైన జీవితాలను మార్చాలనే ఆలోచనతో 1970లో చదువు పూర్తయిన వెంటనే ఆదివాసీ గిరిజన అభ్యుదయసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. రాజకీయాలతోనే ఆదివాసీల అభివృద్ధికి సాధ్యమని 1978లో రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. గిరిజనుడిని కావటంతోనే రాజకీయంగా సరైన గుర్తింపు లభించలేదు. అయినా గిరిజన అభ్యున్నతి కోసం ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment