పోలీసులకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’
ఆదిలాబాద్ క్రైం : జిల్లా పోలీసుల ఆరోగ్య సంరక్షణపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ‘మాస్టర్ హెల్త్ చెకప్’ కార్యక్రమాన్ని ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ ప్రవేశపెట్టారు. జిల్లా కేంద్రంలోని సాకేత్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఎస్పీ ఈ పథకాన్ని సోమవారం ప్రారంభించారు.
40 సంవత్సరాలు నిండిన ప్రతీ పోలీసు కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌లో హెల్త్ చెకప్ నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం జిల్లాలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందున అలాంటి సమస్యలు తలెత్తబోవని చెప్పారు.
పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా నిర్వర్తిస్తారని తెలిపారు. అన్ని వైద్య పరీక్షలు ఆధునిక పరికరాలతో నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, సాకేత్ ఆస్పత్రి వైద్యుడు మనోహర్, ఏఆర్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, పోలీసు అసోసియేషన్ అధికార ప్రతినిధి తాజుద్దీన్, సీఐలు బుచ్చిరెడ్డి, రవీందర్, ప్రవీణ్‌రెడ్డి, ఎస్సైలు, వైద్యులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
కుంటాల : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. కుంటాల పోలీస్‌స్టేషన్‌ను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు గ్రామగ్రామాన పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని, ఇందుకోసం జిల్లాలో త్వరలో 40 మంది మహిళా కానిస్టేబుళ్లతోపాటు మహిళా హోంగార్డులను నియమిస్తున్నట్లు చెప్పారు.
ఆయా పోలీస్‌స్టేషన్లలో సిబ్బందికి క్వార్టర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. భైంసా డీఎస్పీ రావుల గిరిధర్, గ్రామీణ సీఐ ఎడ్ల మహేశ్, కుంటాల ఎస్సై ఎల్.రాజు, భైంసా రూరల్ ఎస్సై రవిప్రసాద్ పాల్గొన్నారు.