రాయికల్ : ఇరాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా యి. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు నాలుగైదు రోజులుగా హోరాహోరీ యుద్ధం జరుగుతోంది. దీంతో అక్కడి తెలంగాణవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని పనికి వెళ్లనీయకుండా యజమాను లు క్యాంపులకే పరిమితం చేస్తున్నారు.
నాలుగు రోజులుగా వీరికి బయటిప్రపంచం తో సంబంధాలు తెగిపోయాయి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో తమ వారి యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచి 20 వేల మంది కార్మికులు ఉపాధి నిమిత్తం ఇరాక్‌లోని బాస్రా, బాగ్దాద్, మన్సూరియా ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. యుద్ధ వాతావరణంతో వీరంతా క్యాంపులకే పరిమితం అయ్యారు.
ఏం జరుగుతోంది?
ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా అక్కడ ఉన్న తెలంగాణ ప్రజల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మన వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీయాలని సూచించినట్లు సమాచారం. ఈమేరకు ప్రధాన కార్యదర్శి కేంద్ర విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు.
ఇరాక్ నుంచి ఫోన్ చేస్తేనే...
మా నాన్న పనికోసం ఆరు నెలల క్రితం ఇరాక్ వెళ్లాడు. మొన్నటివరకు ఆయన మంచిగనే పనిచేసుకుంటూ ఉన్నాడు. వారం రోజులుగా ఇరాక్‌లో యుద్ధం జరుగుతందని టీవీల్లో చూసి భయమైతంది. ఫోన్ చేస్తే కలవకపోతే బాగా భయపడ్డాం. నాన్నే ఇరాక్ నుంచి ఫోన్ చేసి నేను మంచిగనే ఉన్నానని, భయపడవద్దని చెప్పిండు.
- శేఖర్, కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం
నాలుగు రోజులుగా క్యాంపుల్లోనే..
ఇరాక్‌లో యుద్ధం జరగడంతో మా యజమాన్యం కంపెనీల్లో పని చూపించకుండా క్యాంపుల్లోనే ఉంచుతోంది. మా యోగక్షేమాలు కూడా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది.
- వడ్లూరి భూమయ్య, ఇరాక్ నుంచి..
ఆదుకోవాలి..
ఇరాక్‌లో యుద్ధ వాతావరణంలో తెలంగాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించాలి. విదేశాంగ మంత్రితో మాట్లాడి మనవారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలి.
- కోటపాటి నర్సింహనాయుడు,
గల్ఫ్ బాధితుల పోరాట హక్కుల సమితి అధ్యక్షుడు
ఇరాక్‌లో బిక్కుబిక్కు
Published Wed, Jun 18 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement
Advertisement