భద్రాచలం, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం పనులకు చెల్లింపుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడే సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఐటీడీఏ పీఓ దివ్య హెచ్చరించారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 29 మండలాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతీ కుటుంబానికి వంద రోజుల పనులు కల్పించాల్సిందేనని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ఏజెన్సీలో 26 మండలాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు జరుగకపోవడానికి కారణాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సకాలంలో లక్ష్యాలు సాధించకపోతే ఎలా అంటూ ఆయా మండలాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేసిన దుమ్ముగూడెం, టేకులపల్లి, చింతూరు మండలాల సిబ్బందిని పీఓ అభినందించారు. మిగిలిన వారు ఈ నెల 31లోగా లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ హక్కు చట్టం ద్వారా భూములు పొందిన గిరిజనుల భూము ల్లో పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందించాలని, ఉపాధి పనుల్లో ఇందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం పనుల్లో వెనుకబడినట్లుగా నివేదికలు చెబుతున్నాయని, వీటిపై సమీక్షించుకొని ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి టార్గెట్‌లను పూర్తి చేయాలని సూచించారు. చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లించేలా తగు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భాగంగా పండ్ల మొక్కల పెంపకంలో నిర్థేశించిన లక్ష్యాల సాధనలో పూర్తిగా వెనుకబడిపోవటం విచారకరమన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భద్రాచలం మండలంలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులపై అడిగి తెలుసుకున్నారు. రూ.9,76,435లు పెండింగ్‌లో ఉన్నాయని భద్రాచలం ఏపీడీ వెంకటరమణ ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకొచ్చారు. అయితే జీరో మాస్ సంస్థ మాత్రం రూ.3 లక్షలు మాత్రమే ఉన్నట్లుగా వివరించారు. దీనిపై ఐటీడీఏ పీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన నిదులు ఏమయ్యాయని ప్రశ్నించారు. వెంటనే తగు వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న జీరోమాస్ సంస్థ ప్రతినిధులపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏజెన్సీ మండలాల్లో ఉపాధి హామీ పనులు తనిఖీల బాధ్యతలను ఇక నుంచి ప్రత్యేక కమిటీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మల్లికార్జున్, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఈజీఏ ఏపీడీ బలరాం, పీఎంఆర్‌డీఎఫ్ ప్రతిమలతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. వీరు అన్ని పనులను పూర్తి స్థాయిలో పరిశీలించి అవకతవకలు జరిగినట్లుగా తేలితే తన దృష్టికి తీసుకువస్తారని తెలిపారు. వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాల వారికి అదనంగా మరో 50 రోజుల పనులు కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈజీఎస్ అదనపు ప్రాజెక్టు డైరక్టర్ మోహన్‌రావు, ఏపీడీలు బలరాం, వెంకటరమణ, ఎస్‌ఓ పీటీజీ మల్లీశ్వరి పాల్గొన్నారు.
‘ఉపాధి’ అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
Published Fri, Mar 14 2014 2:22 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement