ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నీటిపారుదల శాఖ పరంగా జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సోమవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి రంగ నిపుణులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్షణ ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే సాగునీటి ప్రాజెక్టులకే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేసి వాటికి అవసరమయ్యే నిధుల కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్‌లోనే చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో జిల్లాలోని ఐదు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది.
తక్కువ వ్యయంతో పూర్తి
జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరంగా పరిశీలిస్తే.. కేవలం రూ.20 కోట్లు కేటాయిస్తే ఐదు ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. వీటి ద్వారా 56 వేల ఎకరాల ఆయకట్టు తక్షణం వృద్ధిలోకి వస్తుంది. ర్యాలీ వాగు, మత్తడివాగు, స్వర్ణ, సాత్నాల, గొల్లవాగులు స్వల్ప వ్యయంతో పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇందులో సాత్నాల, స్వర్ణ ప్రాజెక్టులు ఆధునికీకరణ పనులుకాగా మిగతావి కొత్త ప్రాజెక్టులు.
ఇవీ చివరి దశ నిర్మాణంలో ఉన్నాయి. మరో రూ.128 కోట్లు కేటాయిస్తే నీల్వాయి, గడ్డెన్నవాగు, జగన్నాథ్‌పూర్, కడెం ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇందులో కడెం ప్రాజెక్టువి ఆధునికీకరణ పనులు. ఈ ప్రాజెక్టుల ద్వారా 1.10 లక్షల ఎకరాలు వృద్ధిలోకి వస్తాయి. 2 లక్షల ఎకరాలకు సాగునీరందరించే 60 టీఎంసీల సామర్థ్యం గల శ్రీపాద ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదీ పరిస్థితి
జైపూర్, చెన్నూర్ మండలాలకు చెందిన 20 గ్రామాల పరిధిలో ఆయకట్టుకు నీరందించే గొల్లవాగుకు పిల్లకాలువల మీద స్ట్రక్చర్స్ కట్టాల్సి ఉంది. దీనికోసం భూ సేకరణకు ఇబ్బందులు ఉన్నాయి. రూ.83.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.82.20 కోట్లు వెచ్చించారు. మరో రూ.1.41 కోట్లు సమకూర్చాల్సి ఉంది.
తాంసి మండలంలోని వడ్డాడిలో ఉన్న మత్తడివాగు డిస్ట్రిబ్యూటర్ నంబర్ 14లో పనులు అసంపూర్తిగా నిలిచాయి. రూ.4 కోట్లు కేటాయిస్తే ఈ పనులు పూర్తి అవుతాయి. కుడికాలువ కెనాల్ కోసం తాజాగా రూ.9 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.
{పాజెక్టు ఆధునికీకరణ పనుల్లో ఉన్న సాత్నాలకు రూ.7 కోట్లు, స్వర్ణకు రూ.5 కోట్లు, కడెం ప్రాజెక్టుకు రూ.18 కోట్లు కేటాయిస్తే మిగతా పనులు పూర్తయ్యే పరిస్థితి ఉంది.
ప్రాజెక్టులకు ప్రాణం
Published Wed, Aug 6 2014 12:33 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement