సాక్షి, ఆసిఫాబాద్(కెరమెరి): ఎన్నికల్లో గెలుపుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రజలకు ఉచిత హామీలిస్తున్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా హామీలివ్వడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఉచిత హామీలిస్తున్న నాయకులు వాటికి బడ్జెట్‌ను ఎలా సమకూరుస్తారో చెప్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలిపేందుకు మేనిఫెస్టోలు ప్రకటించారు. వాటిలో అనేక హామీలు ఉన్నాయి. నిజానికి ఈ తతంగం కేవలం ప్రచారం కోసమేనని పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయపార్టీల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై ప్రజల్లో చర్చ జరిగిన సందర్భం లేదు. అనేక సందర్భాల్లో పార్టీలు జనాకర్శక పథకాలను ప్రకటించడం, వాటి అమలులో అనేక అవకతవకలు జరిగి ప్రజాధనం వృథా కావడం పరిపాటిగా మారింది. ఓటరు మహాశయున్ని ప్రస్నం చేసుకునేందుకు ఉచిత కానుకలు ప్రకటించారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆదాయ వ్యయాల స్పృహ లేకుండా కేవలం ఓటర్లకు గాలం వేయడానికి ఇటాంటి హామీలు గుప్పిస్తుంటారు.
హామీల అమలు వివరించాలి
హామీలిచ్చే పార్టీలు అధికారంలోకి వస్తే నిధులు ఎక్కడ నుంచి తెస్తారో స్పష్టం చేయాలి. హమీల అమలు కోసం బడ్జెట్ పద్దుల్లో వేరే వాటిపైన కోత విధిస్తారా లేక వనరుల సమీకరణ కోసం కొత్త పన్నులు వేస్తారా అన్నది వివరించాలి. ప్రతీ హామీ అమలుకు స్పష్టమైన కాల పరిమితి పెట్టాలి. అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట కాలపరిమితిలోగా హామీని నెరవేర్చడంలో విఫలమైన పార్టీలు తామంత తాముగా వైదొలిగేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత హామీలిచ్చే పార్టీలను అరికట్టాలి. పార్టీల మేనిఫెస్టోలో ప్రజలు, కూడు, గుడ్డతో సంబంధంలేని ప్రధానాంశాలు ఉన్నాయి.
బ్రిటన్ తరహాలో చర్చించాలి
బ్రిటన్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందే మేనిఫెస్టోను ప్రకటించి, అందులో పొందుపర్చిన హామీలపై విసృతంగా చర్చిస్తారు. మేనిఫెస్టోలను ఇంటర్‌నెట్‌లో చూసుకునే అవకాశం కూడా కల్పిస్తాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు వృథా కాకుండా నియంత్రిస్తారు.
రుణాల రద్దు ఎందుకు..?
రైతుకు నష్టం వచ్చినప్పుడు నష్టపరిహారం అందించడం సహజం. కానీ అన్ని రుణాలను రద్దు చేస్తామని ప్రకటించడం దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడమే అవుతుంది. బ్యాంకుల దివాళా తప్పదు. ఉచితం అనేది ఓట్లు పొందేందుకు వేసే మంత్రం. నీతికి ఓటేసి అవినీతిని సమాధి చేద్దాం.
-సుజాయిత్ ఖాన్. సామాజిక కార్యకర్త, కెరమెరి
ఉచితమే.. కానీ అందరికి కాదు
ఎన్నికల్లో మొదట నాయకులు అన్ని ఉచితమే అంటారు. తర్వాత కొందరికే అంటారు. దానికి లక్షా తొంబై కారణాలు వెదుకుతారు. పేద, మధ్య ,తరగతికి ఉపయోగపడే మామీలను నాయకులు ఇవ్వాలి. చిత్తశుద్దితో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. గెలవడానికి వేసే పాచికలు ఇవి.
– ధర్మారావు, చౌపన్‌గూడ
Comments
Please login to add a commentAdd a comment