ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. | Top priority to irrigation projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు ప్రాధాన్యం..

Published Tue, Mar 14 2017 5:37 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. - Sakshi

ప్రాజెక్టులకు ప్రాధాన్యం..

► ప్రాణహిత, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు సింహభాగం 
► కడెంకు అనూహ్యంగా రూ.207.72 కోట్లు
► లోయర్‌ పెన్‌గంగకు రూ.360కోట్లు
► కుమురం భీంకు రూ.150 కోట్లు
► కులాల వారీగా కేటాయింపుపై ఆయా వర్గాల్లో హర్షం
► వైద్య, విద్య సదుపాయాలకు కొత్త జిల్లాల వారీగా రూపొందని బడ్జెట్‌
► రాష్ట్ర స్థాయి కేటాయింపులే కొత్త జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆధారం
 
సాక్షి, మంచిర్యాల : 
రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రైతాంగంలో కొత్త ఆశలు నింపింది. జిల్లాలోని ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే చిన్న తరహా ప్రాజెక్టులకు సైతం ప్రభుత్వం గత బడ్జెట్‌ కన్నా అధిక మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధానమైన ప్రాజెక్టులకు రూ.1804.13 కోట్లు కేటాయింపులు జరిపినట్లు బడ్జెట్‌ లెక్కలను బట్టి తెలుస్తోంది.
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాణహితకు రూ.775.44 కోట్లు, ఎల్లంపల్లికి రూ.397.97 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు సాగునీటిని అందిస్తున్న కడెం ప్రాజెక్టుకు అనూహ్యంగా రూ.207.72 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు గత సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కేవలం రూ.9.37 కోట్లు మాత్రమే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పనులు పూర్తయినప్పటికీ, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల అభివృద్ధి, ఇంటి అడుగు స్థలాలకు నష్టపరిహారం వంటి వాటి కోసం ఈ మొత్తాన్ని కేటాయించనున్నారు. 
 
ఆదిలాబాద్‌ జిల్లాకు కీలకమైన లోయర్‌ పెన్‌గంగ (కొరట, చణాకా) ప్రాజెక్టుకు సైతం అధిక నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్‌లో రూ.124.69 కోట్లు దక్కగా, ఈసారి బడ్జెట్‌లో ఏకంగా రూ.360 కోట్లు కేటాయించడం విశేషం. అలాగే కుమురం భీం జిల్లాకు సాగునీటి అవసరాలు తీర్చే కుమురం భీం ప్రాజెక్టుకు గత సంవత్సరం రూ.60 కోట్లు కేటాయించగా, దాన్ని ఈసారి రూ.150 కోట్లకు పెంచడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నిధులు లేక సగంలో ఆగిపోయిన నీల్వాయి ప్రాపెక్టుకు సైతం ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రూ.70 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించింది. ఇవి కాకుండా స్వర్ణ, సుద్దవాగు, మత్తడివాగు, ఎన్టీఆర్‌ సాగర్, జగన్నాథపూర్‌ పెద్దవాగు, ర్యాలివాగులకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం విశేషం.
 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రాష్ట్రంలోనే అధికంగా రూ.6,681.87 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లా పరిధిలో నిర్మాణం జరుగుతున్నప్పటికీ, దీనికోసం నిర్మించే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వల్ల గోదావరిలో నీటి నిల్వలు పెరిగి రైతాంగానికి ఉపయోగపడుతుందని మంచిర్యాల జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల వల్ల మంచిర్యాల జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా సాగునీటికి ఢోకా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. గత సంవత్సరం ప్రాణహిత, ఎల్లంపల్లి, కడెం వంటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఈసారి కూడా అదే రీతిలో కేటాయించిన నిధులను విడుదల చేసి, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. 
 
అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా... 
వెనుకబడిన కులాలు, ఇతర వర్గాలకు ఈ బడ్జెట్‌లో జరిపిన కేటాయింపుల పట్ల్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక, విద్యుత్, రహదారుల అభివృద్ధి రంగాలకు మెరుగైన కేటాయింపులు జరపడంతో పరోక్షంగా ఉమ్మడి జిల్లాకు కూడా ఉపయోగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.6వేల కోట్ల వరకు కేటాయింపులు చేసింది. హైదరాబాద్, కరీంనగర్‌లలో సూపర్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపిన సర్కార్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు వైద్యపరంగా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొంత నిరాశను కలిగించింది.
 
గర్భిణులకు ఆర్థిక సహాయం, శిశువులకు అవసరమైన 16 వస్తువులతో కేసీఆర్‌ కిట్, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ల వర్తింపు, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలను రూ.10,500కు పెంచడం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇవే కాకుండా బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం వంటి అంశాలు సామాన్యులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement