కేంద్ర మంత్రుల దృష్టికి రాష్ట్ర సమస్యలు
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు బుధవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, పలు శాఖల కార్యదర్శులతో భేటీ అయ్యారు. అనంతరం వివరాలను విలేకరులకు వివరించారు. పత్తి కోనుగోలు కేంద్రాల పెంపు, పత్తికి మద్దతు ధర కల్పించేలా చొరవ చూపాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతి ఇరానీని కోరినట్టు తెలిపారు. ‘‘తెలంగాణలో ఈ ఏడు పత్తి అదనంగా మరో 5 లక్షల హెక్టార్లలో సాగవనుంది. కనుక దాదాపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరాం.
గతేడాది 85 కొనుగోలు కేంద్రాలు పెట్టడంతో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మంత్రికి వివరించాం. మెదక్, నల్లగొండ, ఆలేరు, సూర్యపేటల్లోని సీసీఐ సబ్ సెంటర్లను వరంగల్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశాం. ఈ నెల 15న తెలంగాణలో పర్యటించాల్సిందిగా జౌళి శాఖ కార్యదర్శి అనంత్ కుమార్ సింగ్‌ను ఇరానీ ఆదేశించారు. రాష్ట్రానికొచ్చే అధికారుల బృందంతో అన్ని అంశాలపైనా చర్చిస్తాం. వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో నాలుగు అంశాలపై చర్చించాం. పెసలకు మద్దతు ధర కల్పించాలని, మద్దతు ధర విధానంలో మార్పులు తెచ్చి తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరాం. రాష్ట్రవ్యాప్తంగా 58 ఈ–నామ్ సెంటర్లను కేటాయించారు.
ఒక్కోదానికి రూ.75 లక్షలు రావాల్సి ఉండగా రూ.30 లక్షలే విడుదల చేశారు. మిగతా బకాయిలను విడుదల చేయాలని, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాలకు కొత్తగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరాం. గోదాముల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రానికి బకాయి ఉన్న రూ.132 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యావరణ, అటవీ అనుమతులపై అటవీ శాఖల కార్యదర్శి అజయ్‌నారాయణ ఝాతో చర్చించాం. కాళేశ్వరం తొలి దశ అనుమతుల మంజూరు ఆలస్యమవుతోందని చెప్పాం. వచ్చే సోమవారం ఉన్నత స్థాయి భేటీ నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ వెంటనే తొలి దశ అనుమతులొస్తాయి’’ అని మంత్రి వివరించారు. భేటీల్లో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.