- ఐఎస్‌ఐఎస్ వలలో స్థానిక యువకుడు..?
- ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ మృతి..?
- అతనితో పాటే కరీంనగర్ జిల్లా వాసి
- ఆరా తీస్తోన్న నిఘా వర్గాలు
సాక్షి, మంచిర్యాల: నిషేదిత ఉగ్రవాద సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) నీడ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలపైనా పడింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు ఆకర్శితులయ్యేలా గాలం వేస్తోన్న ఆ సంస్థ ఉగ్రవాదులు మంచిర్యాలకు చెందిన ఓ యువకుడినీ తమ సంస్థలో చేర్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మంచిర్యాల పట్టణానికి చెందిన ఒకరి కుమారుడు ఉన్నత చదువుల కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. కొన్ని నెలలు చదువుపై దృష్టి పెట్టిన సదరు యువకుడు ఆ తర్వాత నిషేదిత సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)కు ఆకర్శితుడై అందులో చేరాడు. తాను ఐఎస్‌ఐఎస్‌లో చేరిన విషయాన్ని గతంలో ఓసారి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. అటు విషయం తె లుసుకున్న నిఘా వర్గాలూ యువకుడి కుటుంబీకులు, బంధువులను హైదరాబాద్‌కు పిలిపించి రహాస్యంగా విచారించినట్లు సమాచారం. ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడారు..?
అతను ఐఎస్‌ఐఎస్‌లో చేరడంలో ఎవరి ప్రమేయం ఉందీ..? అనే విషయాలతో పాటు అక్కడ ఆ యువకుడి స్నేహితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే, సదరు యువకుడు ‘ఉగ్ర’ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ విదేశాల్లోనే ఇటీవల మరణించినట్లు ప్రాథమికంగా తెలిసింది. అయితే.. అతను ఎలా మరణించాడు..? అంత్యక్రియలు ఎక్కడ జరిగాయనేదీ మాత్రం ఎవరికీ తెలియదు. మరోపక్క.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన మరో యువకుడూ ఇతనితో పాటే నిషేదిత ఉగ్ర సంస్థలో చేరినట్లు విశ్వసనీయ సమాచారం.
మంచిర్యాలపై ‘ఉగ్ర’ నీడ..!
Published Sat, May 2 2015 4:18 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement