ఉగ్రజాడలు
♦ వికారాబాద్‌లో ఇబ్రహీం ముఠా కదలికలు
♦ పాస్‌పోర్టుల ఆధారంగా సిమ్‌కార్డుల కొనుగోలు
♦ స్థానిక జిరాక్స్ సెంటర్‌లో పాస్‌పోర్టుల జిరాక్స్‌లు
♦ వీటిని ఎక్కడైనా తస్కరించారా? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు
చించోళి- వికారాబాద్ మధ్య రాకపోకలు సాగించినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడి ఒకవేళ హైదరాబాద్‌లో దాడుల వ్యూహం ఫలిస్తే.. కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ఉగ్రవాడులు ప్రణాళిక రూపొందించుకున్నట్టు ఎన్‌ఐఏ విచారణలో వెలుగుచూసింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మరోసారి జిల్లాలో ‘ఉగ్ర’మూలాలు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సంచరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన టైస్టులు ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ పలుమార్లు వికారాబాద్, చించోళి పట్టణాల కు రాకపోకలు సాగించినట్లు స్పష్టమైంది. పోలీసుల కళ్లుగప్పి ఐసిస్ అగ్రనేతలతో మాట్లాడేందుకు వినియోగించిన సిమ్ కార్డులలో రెండు చిరునామాలు జిల్లాకు చెందినవే కావడంతో పోలీసు యంత్రాంగం నివ్వెరపోయింది. జిల్లాకు చెందిన ఇద్దరి వ్యక్తుల పాస్‌పోర్టుల ఆధారంగానే ఎయిర్‌టెల్ సిమ్ కార్డులను పొందినట్లు తేలింది. ఇబ్రహీం స్థానిక బీజేఆర్ చౌరస్తాలోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌లో జిరాక్సులు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది.
రంజాన్ పండగ వేళ రాజధానిలో విధ్వంస రచనకు కుట్రపన్నిన ఇబ్రహీంతో సహా మరో నలుగురు ఐసిస్ తీవ్రవాదులపై ఎన్‌ఏఐ మెరుపు దాడులు చేసి చాకచక్యంగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో సిమ్‌కార్డులు పొందడానికి ఎలాంటి ఆధారాలను సమర్పించారు? ఆ పాస్‌పోర్టులు ఎక్కడి నుంచైనా తస్కరించారా? ఎవరైనా సమకూర్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా వీరికి ఎవరైనా సహకారం అందించారా అనే విషయంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ సిమ్‌కార్డులతో ఎవరెవరితో సంభాషణలు జరిపారనే అంశంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు టవర్ లోకేషన్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది.
వికారాబాద్‌లో బీఈ చదివి..
పాతబస్తీకి చెందిన ఇబ్రహీం యజ్దానీకి వికారాబాద్‌తో గతం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2003లో స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన యజ్దానీ.. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడే ఐసిస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఇబ్రహీం.. ఇక్కడే ముఠా ఏర్పాటు చేశాడు. రాజధానిలో ఒకేసారి పలుచోట్ల బాంబు పేలుళ్లు, తుపాకులతో విరుచుకుపడేలా ప్లాన్ వేశాడు. అయితే, ఎన్‌ఐఏ అధికారుల అప్రమత్తంతో హైదరాబాద్‌కు ఉగ్రముప్పు తప్పింది. ఒకవేళ వారి వ్యూహం ఫలిస్తే.. దాడుల అనంతరం కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లుగా ఎన్‌ఐఏ విచారణలో వెలుగుచూసింది. వికారాబాద్‌లో సొంతంగా స్థావరం ఏర్పాటుచేసుకోవాలనుకున్నారా? ఎవరైనా సహకారం అందిస్తున్నారా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
సిమీ తీవ్రవాదులకు శిక్షణ
గతంలో స్టూడెంట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇస్లామిక్(సిమీ) తీవ్రవాదులు కూడా వికారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ పోలీసులకు పట్టుబడిన సిమీ అగ్రనేత సప్ధర్ నగోరి కూడా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆయుధాల వాడకంలో అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నామని చెప్పారు. మరోవైపు గతేడాది వరంగల్ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరైన వికారుద్దీన్ కూడా చేవెళ్ల సమీపంలోని మదర్సాలో కొన్నాళ్లపాటు తలదాచుకున్నానని పోలీసుల ముందు అంగీకరించారు. తాజాగా ఐసిస్ ముఠా కదలికలు కూడా వికారాబాద్‌లో కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.