చట్ట సవరణతో పురపోరు | Issuing Ordinance and finalizing wards in GVMC | Sakshi
Sakshi News home page

చట్ట సవరణతో పురపోరు

Published Sat, Jun 29 2019 2:26 AM | Last Updated on Sat, Jun 29 2019 8:22 AM

Issuing Ordinance and finalizing wards in GVMC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత మున్సిపల్‌ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పురపాలక చట్టం కొలిక్కి రాకపోవడంతో చట్ట సవరణతో వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం అర్డినెన్స్‌ జారీ చేసింది. జూలై నెలాఖరులోగా ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు/వార్డుల సంఖ్యను ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించినందున వార్డులను హేతుబద్ధీకరిస్తూ పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సగటున 1,500 నుంచి 15 వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉండగా దీన్ని పునర్విభజనతో సవరించింది.

2011 లెక్కల ప్రకారం మున్సిపాలిటీల జనాభా, ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. వాస్తవానికి కొత్త మున్సిపల్‌ చట్టం మనుగడలోకి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించింది. అయితే ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొత్త చట్టం కోసం ఎదురుచూడకుండా ప్రస్తుత చట్టం ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. దీనికి అనుగుణంగా వార్డులను ప్రకటిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. 

గణనీయంగా పెరిగిన వార్డులు... 
సగటున జనాభా, ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోవడంతో మున్సిపాలిటీల్లో భారీగా వార్డులు పెరిగాయి. గతంలో 74 మున్సిపాలిటీల పరిధిలో 1,900 వార్డులుండగా ప్రస్తుతం 138 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ ప్రకారం ఈ సంఖ్య 3,385కి చేరింది. ఆర్డినెన్స్‌కు ముందు ఈ వార్డుల సంఖ్య 2,631గా ఉండేది. చిన్న పురపాలికల్లో 1,000–1,500 ఓటర్లకు ఓ వార్డును సర్కారు ఏర్పాటు చేసింది. ఇక 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 2,500 నుంచి 3 వేల ఓటర్లకు ఒక వార్డు ఉండనుంది. వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 8 లక్షల జనాభా ఉన్న ఈ కార్పొరేషన్‌లో డివిజన్‌కు దాదాపు 15 వేల ఓటర్లు ఉంటే ఐదు లక్షలలోపు జనాభా ఉన్న మిగతా కార్పొరేషన్లలో సగటున ఆరు నుంచి ఎనిమిది వేల మంది ఓటర్లకు ఒక డివిజన్‌ను ఖరారు చేసింది.  

కనిష్టం 10 వార్డులు... 
గతేడాది ఆగస్టు 2న కొత్తగా 68 మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో అతితక్కువ జనాభా ఉన్న మండల కేంద్రాలు కూడా పురపాలికలుగా మారాయి. పట్టణీకరణను పరిగణనలోకి తీసుకున్న సర్కారు భారీగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చిన్న మున్సిపాలిటీల్లో కనిష్టంగా 10 వార్డులు ఏర్పడ్డాయి. అందులో అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్, అమరచింత, ఆత్మకూరు, చండూరు మున్సిపాలిటీలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement