ఉపాధి కల్పనలో ‘ఐటీ’ మేటి | IT exports growth is 190% In the five years | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనలో ‘ఐటీ’ మేటి

Published Sun, Jun 2 2019 2:10 AM | Last Updated on Sun, Jun 2 2019 2:10 AM

IT exports growth is 190% In the five years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఐదేళ్లుగా సాధించిన పురోగతి నివేదికను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ శనివారం విడుదల చేశారు. రాష్ట్ర ఐటీ విభాగం వివిధ రంగాల్లో మెరుగైన సేవల కోసం చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఈ నివేదికలో వివరించారు. ‘రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులను రెండేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత నాలుగేళ్లలో జాతీయ స్థాయిలో 170 శాతం వృద్ధి కనిపించగా రాష్ట్రంలో 190 శాతం మేర వృద్ధి నమోదైంది. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య త్వరలో 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ రంగానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన టీ–హబ్, టాస్క్, టీ–సాట్, టీ–ఫైబర్, స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఏర్పాటు లక్ష్యాలకు మించి ఫలితాన్ని ఇస్తున్నాయి. కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యత (సీఎస్సార్‌) మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి టీ–సిగ్‌ (తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌)ను ఐటీ విభాగానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తాం’అని జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. ఐటీ రంగంలో 5.43 లక్షల ఉద్యోగాలను సృష్టించగా గతేడాది ఏకంగా 67,725 మంది వృత్తి నిపుణులకు కొత్తగా అవకాశం లభించిందన్నారు. 

ఐటీ పురోగతి నివేదికలో పేర్కొన్న అంశాలివీ
- మెరుగైన పౌర సేవలు అందించేందుకు ‘మీ సేవ’అధునాతన వెర్షన్‌ను సిద్ధం చేశాం. ఆధార్‌ అనుసంధాన చెల్లింపుల విధానం (ఏఈపీఎస్‌)లో మీ సేవ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే వీలుంటుంది. ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ డెలివరీ (ఈఎస్‌డీ)లో భాగంగా రూపొందించిన రియల్‌ టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ ద్వారా పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌లు సమర్పించే విధానం సత్ఫలితాలిస్తోంది. 
- నాస్కామ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన టెక్నాలజీ ఎంపవరింగ్‌ గర్ల్స్‌ (టెగ్‌) ద్వారా 66 మంది బాలికలకు డిజిటల్‌ ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ విభాగాలు ఐటీ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.  
- ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో మెకానికల్, మెకానికల్‌ స్టార్టప్స్‌కు సంబంధించి 78 వేల చదరపు అడుగుల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్‌ సెంటర్‌ (టీ–వర్క్స్‌)ను ఐటీ విభాగం గతేడాది ప్రారంభించింది. 
- రాష్ట్ర ప్రభుత్వ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ‘టీ–శాట్‌’ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేయగా 2.39 లక్షల మంది వీక్షించారు. టీ–శాట్‌ యూట్యూబ్‌ చానల్‌కు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 
- ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమ వేదిక ‘టీ–వెబ్‌’ద్వారా సగటున ప్రతి నెలా 3 కోట్ల మందిని చేరుతోంది. 
- తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ) ద్వారా టైర్‌–2, టైర్‌–3 పట్టణాల్లో ఐటీలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా ఇప్పటివరకు 12 జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 
- కార్మిక, పోలీసులు, స్త్రీ నిధి, ఆర్టీసీ, డెయిరీ, పౌర సరఫరాలు, జేఎన్‌టీయూ తదితర విభాగాల సేవలను ఒకేచోటకు తెస్తూ గతేడాది ప్రారంభించిన ‘టీ–వ్యాలెట్‌‘ద్వారా 2018–19లో రూ. 1,202 కోట్ల విలువ చేసే 28.8 లక్షల లావాదేవీలు జరిగాయి. 1.72 లక్షల మంది తమ వివరాలను వ్యాలెట్‌లో నమోదు చేసుకున్నారు. 
- నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ‘టీ–హబ్‌’కొత్త ఆవిష్కరణలు, కొత్త వ్యాపార నమూనాలు రూపొందించడంలో విజయవంతమైంది.  
- ‘టాస్క్‌’ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది యువత ఏడాది కాలంలో వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ పొందారు. 
- ఆవిష్కరణ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘వీ హబ్‌’ద్వారా శిక్షణ, అవకాశాల కల్పన తదితరాలపై మద్దతు ఇస్తుండగా 245 మంది వారి ఆలోచనలు పంపారు. వాటిలోంచి 26 వినూత్న ఆలోచనలను ఎంపిక చేశారు. మహిళా ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు యూఎస్‌ ఇండియా కౌన్సిల్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబుల్‌ సహకారంతో ‘బిజ్‌ అరెనా’పేరిట పోటీ నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement