ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక భాషల్లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను రూపొందిస్తేనే ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. దేశ జనాభాలో 60–70 శాతం మందికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేనందున ఆ భాషలో తయారైన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను ఉపయోగించుకోలేక పోతున్నారన్నారు. మన దేశంలో 22 అధికారిక భాషలున్నాయని, ప్రజలు మాట్లాడే ఈ భాషల్లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారమిక్కడ హైటెక్స్‌లో ప్రారంభమైన మూడ్రోజుల ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మాట్లాడారు. సామాన్య ప్రజలకు ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిరర్థకమని కేసీఆర్ తనతో అంటుంటారని, వారికి ప్రయోజనం కలిగించే టెక్నాలజీ వృద్ధికి కృషి చేయాలని ఐటీ రంగ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని లక్ష గృహాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి టీ–ఫైబర్ పథకాన్ని చేపట్టామన్నారు. దీనిద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 20 వేల చదరపు అడుగుల స్థలంలో ఈ–హబ్ రెండో విడత భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ల ఇంక్యుబేటర్‌గా ఇది అవతరించనుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెచ్చిన రూరల్ టెక్నాలజీ పాలసీకి మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే రెండో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్ తొలిసారిగా భారత్‌లో.. అదీ హైదరాబాద్‌లో జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ నగరంలో ఐటీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది.
ప్రస్తుతం ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రాంతం. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి ఎన్నో ప్రఖ్యాత కంపెనీలకు ఈ నగరం నిలయం’’అని చెప్పారు. ఐటీ రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందంటూ నగరంలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) చైర్మన్ ఇవాన్ చియూ, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, విప్రో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషబ్ ప్రేమ్‌జీ, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షుడు చంద్రశేఖర్, టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ప్రసంగించారు. అంతకుముందు ‘ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్’ అనే అంశంపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన ఐటీ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో హైటెక్స్‌లోని సదస్సు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
కృత్రిమ మేధోశక్తితో సవాళ్లు: రవిశంకర్
ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగంలో కీలక శక్తిగా మారిన కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పరిజ్ఞానంతో ప్రయోజనాలతోపాటు దుష్పరిణామాలు సైతం ఎదురు కావొచ్చని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. దీని ద్వారా జరిగే నష్టాలు, నేరాలకు బాధ్యత ఎవరిదన్న అంశంపై ఐటీ రంగం మేధోమథనం జరపాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీ సైతం ప్రధానాంశంగా మారిందన్నారు. దేశంలో ఐటీ రంగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా డిజిటల్ ఇండియా కింద దేశంలోని గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భారత్ ప్రపంచంలో అత్యధిక స్టార్టప్ కంపెనీలు కలిగిన మూడో దేశమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment