‘ఐటీఐఆర్’కు మాస్టర్‌ప్లాన్
- ఆర్‌ఎఫ్‌పీ తయారీపై ముమ్మర కసరత్తు
- బిడ్స్ ఆహ్వానించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు
- 2016 నాటికి ప్రణాళిక అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో ఐటీ రంగానికి సంబంధించి సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ను రూపొందించే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగించింది.
గ్రేటర్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న హుడా, హడా, సీడీఏ తదితర మాస్టర్‌ప్లాన్లను అవసరమైన మేరకు మార్పులు చేసి ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అనుగుణంగా సవరించేందుకు హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్ లోపల సుమారు 202చ.కి.మీ. మేర 5 జోన్లలో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు పడింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదిక రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఈ మేరకు తగిన అర్హతలున్న కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు అధికారులు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’(ఆర్‌ఎఫ్‌పీ)ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 2016 నాటికి ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్‌ను అమల్లోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పరిశ్రమిస్తున్నారు.
బిడ్స్‌కు ఆహ్వానం..
ప్రైవేటు కన్సల్టెన్సీ నియామకానికి బిడ్స్ ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. బిడ్స్‌ను పరిశీలించి అన్ని అర్హతలున్న కన్సల్టెన్సీని ఎంపిక చేసే బాధ్యతను ఉన్నతాధికారులతో కూడిన స్క్రూట్నీ కమిటీ నిర్వర్తిస్తుంది. అనంతరం ఎంపికైన సంస్థతో ఒప్పందం చేసుకొని 6-8 నెలల వ్యవధిలో పక్కా నివేదికను రూపొందించేలా లక్ష్యాన్ని నిర్దేశిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మార్పులు, చేర్పులు..
ప్రైవేటు కన్సల్టెన్సీ రూపొందించిన డ్రాఫ్టు ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టి వారి అభ్యంతరాల మేరకు మార్పులు, చేర్పులు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నగరం నలువైపులా ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడెక్కడ వస్తోంది? వాటి సరిహద్దులు, సర్వే నంబర్లను గుర్తించాల్సి ఉంటుంది. అక్కడి భూములు ప్రభుత్వానివా...? లేక ప్రైవేటు వ్యక్తులవా..? అన్నది అధ్యయన సంస్థ గుర్తించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందంటున్నారు.
ఇప్పటికే కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులన్నీ ఒక్క మహేశ్వరం మండలంలో తప్ప మిగతావన్నీ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నాయి. ఇవన్నీ పాత మాస్టర్ ప్లాన్ పరిధిలోవే గనుక మార్పులు చేయడం పెద్ద ఇబ్బందేమీ కాదని హెచ్‌ఎండీఏ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మార్పుల అనంతరం ప్రభుత్వం పరిశీలించి అనుమతించాక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఐటీఐఆర్‌లకు అనుగుణంగా సవరించిన మాస్టర్ ప్లాన్‌ను అమల్లోకి వస్తుందంటున్నారు.