
విద్య టు విద్యుత్...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి శాఖ మారింది. ఇప్పటి వరకు విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయనకు విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగిం చారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా చేపట్టిన మార్పుల్లో జగదీష్‌రెడ్డి పోర్టుపోలియో మారింది. ఇప్పటివరకు ఆయన చూస్తున్న విద్యాశాఖ బాధ్యతలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న కడియం శ్రీహరి (వరంగల్)కి ఇచ్చారు. ఇటీవలే జరిగిన కేబినెట్ విస్తరణలో విద్యుత్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్)కి వైద్య, ఆరోగ్యశాఖను కేటాయించి, ఆయన చూస్తున్న విద్యుత్‌శాఖను మన జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం ప్రపంచ విద్యాసదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన మంత్రి తిరిగి హైదరాబాద్ వచ్చాక విద్యుత్‌శాఖ బాధ్యతలు తీసుకోనున్నారు.
విద్య కన్నా విద్యుత్తే బెటర్..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే జిల్లా మంత్రికి విద్య కన్నా విద ు్యత్ శాఖ కేటాయింపే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణానదీ తీరంలోని దామరచర్ల మండలంలో 6800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో జగదీష్‌రెడ్డికి విద్యుత్ శాఖ ఇవ్వాలనే కేసీఆర్ నిర్ణయం జిల్లాకు మంచి చేస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలంటున్నాయి. జిల్లా అవసరాల మేరకు జగదీష్‌రెడ్డిని సీఎం విద్యుత్ శాఖకు ఎంచుకుని, ఆయన పోర్టుపోలియోను మార్చారని అంటున్నాయి. దీంతోపాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రం విషయంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు కూడా విద్యుత్ శాఖ ఉపయోగపడుతుందని, మరోవైపు వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాలోని ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు అవసరమయ్యే విద్యుత్ అంచనాల విషయంలోనూ జిల్లాకు న్యాయం జరుగుతుందని వారంటున్నారు. అయితే, విద్యా శాఖమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఏడునెలలే అయినా శాఖ ఎందుకు మార్చారనే చర్చ కూడా జిల్లాలో జరుగుతోంది. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో పట్టురాకుండానే శాఖను మార్చడం వల్ల కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
థర్మల్ ప్రాజెక్టు పరుగులు తీసేనా....
ఏదిఏమైనా జగదీష్‌రెడ్డికి విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో దామరచర్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే భూసర్వే పూర్తి కాగా, అటవీ భూమిని తీసుకుంటే అటవీశాఖకు ఇవ్వాలని ఇతర ప్రభుత్వ భూమిని కూడా గుర్తించారు. ఇందుకు సంబంధిం చిన ప్రతిపాదనలను తెలంగాణ జెన్‌కో ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసింది. ఈ ప్రతిపాదనలను తీసుకుని ఢిల్లీ వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌మంత్రిగా థర్మల్ ప్రాజెక్టును వడివడిగా పరుగులుపెట్టించి పూర్తి చేయడం ద్వారా జిల్లా ను విద్యుత్‌హబ్‌గా మార్చాలని ప్రజలు ఆశిస్తున్నా రు.
ఏ శాఖయినా సమర్థవంతంగా నిర్వహిస్తా...
తన శాఖ మార్పుపై మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. లండన్‌లో ఉన్న ఆయన తన శాఖ మార్పు గురించి మాట్లాడుతూ తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ శాఖ అయినా తనకు ఒకటేనని, భవిష్యత్తును దష్టిలో పెట్టుకునే శాఖను మార్చారని ఆయన చెప్పినట్టు పేర్కొన్నాయి. తన శాఖ మార్పు సందర్భంగా సీఎం కేసీఆర్ తనకు ఫోన్‌చేసి అభినందనలు తెలిపినట్టు మంత్రి వెల్లడించారు.