ఇబ్రహీంపట్నంలో వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న నేతలు
ఇబ్రహీంపట్నం: ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాపక్షాన ఉద్యమం చేస్తున్నారని, ఏపీకి కాబోయే సీఎం ఆయనేనని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృతసాగర్ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్థానిక చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ వద్ద.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు వాక్ విత్ జగనన్న పేరుతో రెండు కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు.
ప్రజా సంకల్పయాత్రలో తమ అధినేత ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అయన తనయుడు జగన్ అంతకుమించి పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాక్షస పాలన కొనసాగిస్తున్నారని, దానికి చరమగీతం పాడేందుకు ప్రజల పక్షాన జగన్ ఉద్యమిస్తున్నట్లు తెలియజేశారు. పాదయాత్రకు జనం బ్రహ్మ రథం పడుతున్నారని చెప్పారు.
పేద, బడుగు, బలహీన, మైనార్టీ, మహిళలు, విద్యార్థులు, యువత కోసం నవరత్నాల పథకాలను జగన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పారు. ప్రజాదరణతో ముందుకు వెళ్తున్న తమ నేత వచ్చే ఎన్నికల్లో ఏపీకి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు. అవినీతే ధ్యేయంగా ఆయన పాలన కొనసాగిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నేతలు కేసరి సాగర్, మండల అధ్యక్షుడు పొకాల్‌కార్ హరినారాయణజీ, నాయకులు కుమార్‌గౌడ్, ముస్తఫా, బూర జంగయ్యగౌడ్, జోసెఫ్, చీమల ఉమామహేశ్వర్, హతీరాం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment