
సాక్షి, హైదరాబాద్ : ఆత్మరక్షణ కోసం మహిళలు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆయుధాలిస్తుందా? ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తుందా? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కేటాయించిన గన్‌మెన్లను తొలగించి, మహిళా రక్షణకు వారికి గన్‌మెన్లను ఇవ్వాలని లేదా వారికి ఆయుధాలైనా ఇవ్వాలని ఆయన సూచించారు. ఎన్‌కౌంటర్‌లతో హత్యాచారాలకు ఫుల్‌స్టాప్ పడుతుం దని ప్రభుత్వం భావించవద్దని, అసలు హత్యాచారాలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటేనే ఉత్తమమని ఆయన శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్‌కౌంటర్ ముఖ్యమంత్రి చేయించారనే విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారని, ఆ చర్యను ప్రోత్యహించే విధంగా ఆయన మాట్లాడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.