జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను విభజించి మరో పద్నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల జగిత్యాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు.
ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ నాయకులు సైతం జగిత్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు భౌగోళికంగా అన్ని వసతులు ఉన్నాయని పలు సభల్లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ మరో అడుగు ముందుకేసి జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల జాబితాను ప్రకటించింది.
ఇందులో జగిత్యాల సైతం ఉండటంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
దశాబ్దాల క్రితమే ప్రతిపాదన దశాబ్దాల క్రితం నుంచే మంచిర్యాలను, జగిత్యాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ హయాంలో ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలన దాకా వెళ్లాయి. అప్పటినుంచి ఆర్‌ఎస్‌ఎస్ తమ కార్యకలాపాలను మంచిర్యాల, జగిత్యాల జిల్లాల పేరిటే నిర్వహిస్తుండటం తెలిసిందే. ఇంతకాలం మరుగుపడిన జిల్లాల పునర్విభజన అంశం తిరిగి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరపైకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది.
ఐదు నియోజకవర్గాలతో..
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోకవర్గాలతో జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గా లు కొత్త జిల్లా పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం మెట్‌పల్లి ప్రాంత ప్రజలు కరీంనగర్ వెళ్లాలంటే వంద కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. జగిత్యాల కేంద్రంగా ఎటూ యాభై కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా విస్తరించి ఉంటుంది కాబట్టి దూరభారం తగ్గుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేముల వాడ రాజేశుడు, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి జగిత్యాల జిల్లాకు తలమానికంగా నిలువనున్నారు. జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రతిపాదనలున్నాయి.
జగిత్యాల జిల్లాపై ఆశలు
Published Sat, May 10 2014 2:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement