వీడని జాలి‘ముడి’! | Jalimudi Project Not Yet Started In Khammam | Sakshi
Sakshi News home page

వీడని జాలి‘ముడి’!

Published Mon, Jul 23 2018 10:34 AM | Last Updated on Mon, Jul 23 2018 10:34 AM

Jalimudi Project Not Yet Started In Khammam - Sakshi

జాలిముడి ప్రాజెక్ట్‌ వద్ద నీటి ప్రవాహం, వైరానదిపై నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్‌

మధిర : ప్రతిష్టాత్మకంగా రూ.43కోట్ల వ్యయంతో జాలిముడి గ్రామ సమీపంలో చేపట్టిన తాగునీటి (సీపీడబ్ల్యూ స్కీం) ప్రాజెక్టు నిర్మాణ పనులు ముగిసి, ట్రయల్‌ రన్‌ పూర్తయి మూడేళ్లు గడిచినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అయితే మిషన్‌ భగీరథ పైపులైన్‌ కనెక్షన్‌ను జాలిముడి ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ఇచ్చే అవకాశం ఉండటంతో రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం ఉంది.  మధిర మండలంలోని 33 గ్రామాలు, బోనకల్‌ మండలంలోని 23 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వైరా నదిపై రోజుకు 7 మిలియన్‌ లీటర్ల నిల్వసామర్థ్యం గల ప్రాజెక్టును నిర్మించారు. మధిర మండలం జాలిముడి వద్ద 900 కిలోలీటర్లు, ఖాజీపురం వద్ద 800 కిలోలీటర్లు, బోనకల్‌ గార్లపాడువద్ద 250 కిలోలీటర్ల కెపాసిటీ గల సంపులను నిర్మించారు.

వీటి ద్వారా 56 గ్రామాలకుగాను.. 51 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే మధిర నగర పంచాయతీ పరిధిలోని అంబారుపేటకు తాగునీరు అందడం లేదు. మధిర పెద్ద చెరువు విస్తరణ పనులు జరుగుతుండడంతో పైపులైన్‌ ధ్వంసమైంది. చిలుకూరుకు తాగునీటి పైపులైన్‌ కనెక్షన్‌ కలపాల్సి ఉంది. బోనకల్‌ మండలం ముష్టికుంట్ల, తూటికుంట్ల, చిన్నబీరవల్లి గ్రామాలకు పలు కారణాలతో తాగునీరు అందడం లేదు. మధిర, బోనకల్‌ రైల్వే క్రాసింగ్‌ల వద్ద పైపులైన్‌ కనెక్షన్‌ అనుసంధానం చేయలేదు. తాగునీటిని శుద్ధి చేసేందుకు ఆలమ్, క్లోరినేషన్‌ సమపాళ్లలో కలిపిన తర్వాత ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించాక తాగునీటిని సరఫరా చేయాలి. అయితే ల్యాబ్‌ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. హెడ్‌వర్క్స్, ప్రధాన సంపుల చుట్టూ ప్రహరీ నిర్మించలేదు. ఇటువంటి చిన్నచిన్న పెండింగ్‌ పనులతోపాటు ప్రాజెక్టుపై ఇంజనీర్లు, సూపర్‌వైజర్లను నియమించేందుకు ప్రభు త్వం ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలున్నాయి.  

సమస్యలు ఇలా.. 
తాగునీటిని సరఫరా చేసే వైరా నది వద్ద తూటికాడ పేరుకుపోయింది. ప్రాజెక్టు వద్దకు వచ్చే విద్యుత్‌ తీగలపై తాటిచెట్లు, సుబాబుల్, కంపచెట్లు విరిగి పడుతుండడంతో తరచూ కరెంట్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో నెల రోజులుగా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. పలుచోట్ల పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. గతంలో బోడేపూడి సుజల స్రవంతి పథకం కింద పని చేసిన 40 మంది కార్మికులను ప్రస్తుతం నిర్మించిన జాలిముడి తాగునీటి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.  

‘భట్టి’కి పేరొస్తుందనే.. 
జాలిముడి ప్రాజెక్టుపై సాగు, తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి.. మధిర, బోనకల్‌ మండలాల పరిధిలో సాగు, తాగునీరు అందించేందుకు మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కృషి చేశారు. అయితే 2011 నుంచి చేపట్టిన ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ ట్రయల్‌ రన్‌లోనే ఉంది. మిషన్‌ భగీరథ పైపులైన్‌ కనెక్షన్‌ అనుసంధానం చేయలేదు. త్వరలోనే మిషన్‌ భగీరథ పైపులైన్‌ను ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పైపులైన్‌కు కనెక్షన్‌ ఇచ్చి.. రూ.కోట్ల వ్యయంతో జాలిముడి వద్ద నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలివేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే భట్టి ప్రతిపక్ష నాయకుడు కావడంతోపాటు ప్రభుత్వాన్ని పలు అంశాల్లో ప్రశ్నిస్తుండటం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఆయనకు పెరుగుతున్న ప్రతిష్టను చూసి..

ప్రాధాన్యతను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పలు పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఇది వినియోగంలోకి వస్తే భట్టికి పేరొస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. వేసవిలో సుమారు 50 గ్రామాలకు తాగునీరు అందించిన తాగునీటి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా.. రాజకీయ విభేదాలతోనే ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తాగునీరందించాలి.. 
పెండింగ్‌ పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు తాగునీరందించాలి. బోడేపూడి సుజల స్రవంతి పథకం పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. తాగునీరు కలుషితమవుతోంది. పలుచోట్ల గేట్‌వాల్వ్‌లపై మూతలు లేవు. జాలిముడి ప్రాజెక్టు నీరందడం లేదు. మిషన్‌ భగీరథ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తాగునీటి సమస్య తీరుతుంది.  
– బట్టా గోవిందరాజు, గ్రామస్తుడు, మహదేవపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

తాగునీటిని శుద్ధి చేస్తున్న దృశ్యం, కలపని మిషన్‌ భగీరథ పైపులైన్‌ కనెక్షన్‌ 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement