
48 గంటల్లో అంచనా వేయండి
అకాల వర్షాల వల్ల పంటలకు ఎంత నష్టం వాటిల్లిందో 48 గంటల్లో అంచనా వేయించాలని, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్లో మంగళవారం నాడు అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అకాల వర్షాలకు తెలంగాణలో 70 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు తెలంగాణ సర్కారు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన అన్నారు.
ఇప్పటికే వర్షాభావంతో పంట దిగుబడి లేక, పంటలు గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పుడీ అకాల వర్షాలు మరింతగా రైతులను ముంచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం 33 శాతం తడిసినా కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానాతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, జాతీయ నేతలు భట్టీ, కుంతియా తదితరులు పాల్గొన్నారు.