సాక్షి, హైదరాబాద్: గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుధవారం చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నా అంతరాత్మ ప్రభోదానుసారం మందకృష్ణను కలిశా. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి. హక్కులకై పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళతాం. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలి. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి. అలాగే తెలంగాణలో దళితులకు అయిదు ఎకరాల భూమి ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో తీవ్రస్థాయికి చేరుకుంది. రోహిత్ వేముల బతికుంటే నాతో కలిసి వచ్చేవారు’ అని అన్నారు.
మందకృష్ణను కలిసిన కత్తి మహేష్
మరోవైపు మందకృష్ణను కత్తి మహేష్ కూడా కలిశారు. చంచల్‌గూడకు వెళ్లి...మందకృష్ణను పరామర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపడుతున్న పోరాటానికి కత్తి మహేష్ మద్దతు తెలిపారు. కాగా ట్యాంక్‌బండ్ వద్ద అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించారంటూ మందకృష్ణ మాదిగపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండురోజుల క్రితం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా మందకృష్ణను కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment