అభివృద్ధిలో ఆదర్శంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా | Joint Medak District Is An Ideal For Development | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో ఆదర్శంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా

Published Tue, Oct 8 2019 8:25 AM | Last Updated on Tue, Oct 8 2019 8:25 AM

Joint Medak District Is An Ideal For Development - Sakshi

సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణ ఉద్యమ పరమార్థమే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు.. రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగుతోంది. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే ఆలోచనతో జిల్లాల విభజన జరిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట స్వతంత్ర జిల్లాలుగా ఏర్పడ్డాయి. జిల్లాలు ఏర్పడి ఈ దసరాతో మూడేళ్లు నిండి నాలుగో ఏడాదిలో అడుగు పెడుతున్నాం. ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు ప్రభుత్వానికి ఉన్న అంతరం తగ్గింది. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు మార్గం సుగమమైంది. మూడు జిల్లాల ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని అంటున్నారు 

ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.. ఆయన మాటల్లోనే.... 
ఉమ్మడి మెదక్‌ జిల్లాగా ఉన్న సమయంలో మెదక్, సిద్దిపేట ప్రాంతాల్లోని గ్రామాలకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. దీంతో ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య అంతరం ఎక్కువగా ఉండేది. ఏ ఏడాదికో.. రెండు సంవత్సరాలకో జిల్లా అధికారి ఆయా ప్రాంతాలకు వచ్చేవారు. దీంతో ప్రజల ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందకపోయేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.  కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌తోపాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటూ అన్ని గ్రామాలను సందర్శిస్తున్నారు.. ప్రజలతో మమేకం అయ్యారు. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే అవకాశం వచ్చింది. దీంతో అట్టడుగువర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. 

అందరికీ అందుబాటులో...
జిల్లాలు చిన్నవి కావడం.. విస్తీర్ణం తక్కువగా ఉండటంతో అధికారులకు గ్రామాల్లోకి వెళ్లడం.. సమాన్య ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చే మార్గం సుగమమైంది. దీంతో మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా నేరుగా జిల్లా కేంద్రానికి వచ్చి వారి వారి సమస్యలను అధికారులను చెప్పుకునే వెసులు బాటు కలుగుతోంది. దీంతో మధ్యవర్తిత్వం తగ్గి పారదర్శపాలన పెరిగింది. ఈ  మార్పు ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనం. అదేవిధంగా జిల్లా కేంద్రం సిద్దిపేట విద్య, వైద్యం, మార్కెటింగ్‌ పరంగా శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం వచ్చి.. ఇతర పనులు, వస్తు కొనుగోలు, అమ్మకాలు చేసుకునే విధంగా మారింది. 

ఆరోగ్య తెలంగాణకు బాటలు
స్వరాష్ట్రం సిద్ధించి ఆరు సంవత్సరాల్లో రాష్ట్రం రూపురేఖలే మారిపోయాయి. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలుగా పరుగులు పెడుతుంది. మెతుకు సీమలో నెలకొన్ని కరువును తరిమేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతుంది.. గోదావరి జలాలు బిరబిరా పరుగులు పెట్టించే సమయం ఆసన్నమైంది. కాళేశ్వరం అనుబంధంగా రంగనాయకసాగర్, కొండపొచమ్మ, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణంతో గోదావరి గలగలా పారే సవ్వడి జిల్లాలో సంగీత స్వరాలుగా వినిపించనున్నాయి. అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాం. అయితే ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా.. అందుకోసం స్వచ్ఛమైన పల్లెలుగా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించి 30రోజుల ప్రణాళిక రూపొందించారు. వాటిని మూడు జిల్లాల పాలనా యంత్రాంగం తూచా తప్పకుండా అమలు చేశారు. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు స్వచ్ఛమైనవి మారి, అద్దంలా కన్పిస్తున్నాయి.. ఇది ఆరోగ్య తెలంగాణకు అంకురార్పణ. అదేవిధంగా సమాజిక బాధ్యతగా మూడు జిల్లాలో ప్రతీ ఏటా కోట్లాడి మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణగా.. మార్చే ప్రయత్నం చేశాం. పట్టణాల అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోంది.. అయితే ఇదంతా ఏ అధికారో.. నాయకుడో సాధించిన విజయం అనడం అవివేకం. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా ప్రజలు ఇలాగే సహకరించి కష్టాలు, కన్నీళ్లు లేని తెలంగాణగా రూపుదిద్దుకోవాలి. అప్పుడు త్యాగాలకు ఫలితం.. త్యాగమూర్తులకు మనమిచ్చే ఘననివాళి...

మరిన్ని విజయాలు సాధించాలి
సిద్దిపేట: దుర్గామాత దయతో సిద్దిపేట జిల్లా మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవడంతో పాటు జిల్లా ప్రజలకు దసరా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. దసరా పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందన్నారు. 

రాష్ట్రానికే తలమానికం 
సిద్దిపేట: దుర్గామాత దయతో సిద్దిపేట జిల్లా మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవడంతో పాటు జిల్లా ప్రజలకు దసరా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. దసరా పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement