
సాక్షి, జమ్మికుంట : రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు సమయానికి తిండి, నిద్ర ఉండవని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామని, జర్నలిస్టులకు కనీస వేతనం ఇచ్చేలా మా తరపున తప్పక కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆదివారం రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు.
మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిరుపేద జర్నలిస్టులకు తప్పక ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం. హెల్త్ కార్డుల విషయంలో జరిగిన పొరపాట్లను తప్పక సవరిస్తాం. జర్నలిస్టుల కుటుంబాలలో ఎన్ని బాధలు, కష్టాలుంటాయో నాకు తెలుసు. అలాంటి కుటుంబాలకు వాళ్ల ఇంట్లో సభ్యుడిగా ఉండి ఆదుకుంటాం. ఎవ్వరికైనా ఎక్కడైనా ఏం ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి. వాటి పరిష్కారానికి తప్పకుండా కృషిచేస్తా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాలను ఆదుకుంటున్నాం. తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతిబిడ్డకి ఏదో ఓ రూపంలో సమాయం అందుతుంది. రానున్న రోజుల్లో కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబోతున్నామని’ ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment