సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల పాలన కాలంలో దేశం అరవై ఏళ్ల ప్రగతిని సాధించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్ సంవాద్ ర్యాలీ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాల్వాన్ లోయలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరిహద్దులో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలతో పాటు, కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు కూడా యావత్ దేశం అండగా ఉంటుందన్నారు. (కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం)
సాహసోపేత నిర్ణయాలు..
డిజిటల్ కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు మేరకు కరోనా సంక్షోభ సమయంలో 19 కోట్ల మంది కి సరుకులు అందించగలిగామని తెలిపారు. 2014 ముందు దేశ ప్రతిష్ట అవినీతి తో మసకబారిందని, పాలన ఎక్కడి నుంచి సాగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీ రెండో సారి పగ్గాలు చేపట్టాక అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కరోనా విషయంలో కూడా అనేక చర్యలు చేపట్టామన్నారు.కరోనా నిర్ధారణ పరీక్షలను మొదట్లో ప్రతీరోజూ 1500 చేస్తే.. ప్రస్తుతం 1.5 లక్షల మందికి చేయగలుగుతున్నామన్నారు. కరోనా వ్యతిరేక పోరాటంలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీ లతో ఆరుసార్లు సమావేశమయ్యారన్నారు. 135 కోట్ల మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీ ప్రకటించిందని తెలిపారు.(రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం)
కాంగ్రెస్ విచిత్రంగా వ్యవహరిస్తోంది
‘‘కరోనా విషయంలో మోదీ చర్యలను ప్రపంచ దేశాలు పొగిడాయి. కానీ దేశంలో మాత్రం పార్టీలకు రాజకీయాలే ముఖ్యం. దేశాన్ని నడిపించడం లో మోదీ కి విజన్ ఉంది. దేశం ముందు సంక్షోభం తలెత్తినప్పుడు గతంలో యావత్ దేశం ఏకతాటిపై నిలిచింది. కానీ ఇప్పుడు విపక్ష కాంగ్రెస్ విచిత్రంగా వ్యవహరిస్తోంది. ఆరు దశాబ్దాల ప్రభుత్వాల పనితీరు ఒకవైపు.. మోదీ 6 ఏళ్ల పాలన ఒకవైపు ఉంది. ఆర్టికల్ 370 రద్దు తో జమ్మూకాశ్మీర్ పూర్తిగా దేశంలో అంతర్భాగం అయ్యింది. 9 కోట్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్న ట్రిపుల్ తలాక్ కు స్వస్థి పలికారు. సీఏఏ సవరణ ద్వారా శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించారు. రామజన్మభూమి సమస్యను పరిష్కరించామని’’ పేర్కొన్నారు.
పేదలకు అన్యాయం చేస్తున్నారు..
ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకుండా పేదలకు అన్యాయం చేస్తోందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరుగుతుందన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శలు గుప్పించారు. అధిక కరోనా టెస్ట్ లు చేయడంలేదని, మరణాల రేటు 3శాతం పైగా ఉందన్నారు. తెలంగాణ లో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను మాత్రం రూ.85వేల కోట్ల కు పెంచారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment