సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి, అక్రమ ఆరోపణలపై తప్పకుండా విచారణ జరిపి తీరుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా వెల్లడించారు. అవినీతి, నియంత, అప్రజాస్వామిక పాలనను ఊడబెరికే దాకా తమ పార్టీ రాజీ లేకుండా నిర్ణయాత్మక పోరాటం చేస్తుందని ప్రకటించారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్లు కేసీఆర్ పాలన తయారైందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, కేసీఆర్ ముసుగు
తొలగిస్తామని చెప్పారు. కేసీఆర్ సర్కారుపై బీజేపీ ఒక్కటే రాజీలేని పోరు సాగిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ధర్మ యుద్ధం చేస్తోందని చెప్పారు. ప్రజలు కూడా బీజేపీకి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. మంగళవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు.
కేసీఆర్‌కు ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్టు
‘కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఏటీఎంలా, పాలిచ్చే గోవుగా మారింది. ప్రాజెక్టుకు మార్పులు చేసి, ఎన్నో రెట్లు వ్యయం పెంచి డబ్బు దోచుకున్నారు. దీని ద్వారా నీళ్లు కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్ వరకే వెళ్లాయి. పాలమూరు, రంగారెడ్డికి ఒక్క నీటిచుక్క ఇవ్వలేదు. మిషన్ భగీరథ పథకంలోనూ అవినీతి జరిగింది. అవినీతి అక్రమాలు, అప్రజాస్వామిక పాలన, నియంతృత్వ వైఖరి.. వెరసి దేశంలోనే అత్యంత అవినీతిమయమైనదిగా టీఆర్‌ఎస్ సర్కారు నిలుస్తోంది. కొడుకు, కూతురు, అల్లుడు, ఇతర కుటుంబసభ్యుల కోసం కేసీఆర్ రాచరిక, నియంత పాలన కొనసాగిస్తున్నారు..’ అని నడ్డా ఆరోపించారు.
మానసిక సంతులనం కోల్పోయారు..
‘తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు చూస్తుంటే సీఎం కేసీఆర్‌కు మతి భ్రమించినట్టు, మానసిక సంతులనం కోల్పోయినట్టు స్పష్టమౌతోంది. మనం 21వ శతాబ్దంలో ఉన్నా లేక నియంతృత్వ, రాచరిక పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టులో కేసీఆర్ సర్కారు అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్య హత్య జరిగినట్టు స్పష్టమవుతోంది..’ అని నడ్డా అన్నారు.
జీవో 317ను రద్దు చేసే దాకా పోరు
‘ఉద్యోగుల విభజన జీవో 317ను రద్దు చేసే దాకా బీజేపీ పోరాడుతుంది. ఇందుకోసం రాష్ట్ర పార్టీ సాగిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకే నేను వచ్చా. సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయ, చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతాం. టీఆర్‌ఎస్‌తో గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ లాంటిది లేనేలేదు. ఇది ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో ఒక భాగమే..’ అని స్పష్టం చేశారు.
మంత్రుల ర్యాలీలకు ఎలా అనుతిస్తున్నారు?
‘నేను శాంతియుతంగా నిరసన తెలపకుండా కోవిడ్ నిబంధనలంటూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాంటప్పుడు రాష్ట్ర మంత్రుల ర్యాలీలు, సభలకు ఎలా అనుమతి ఇస్తున్నారు?..’ అని నడ్డా నిలదీశారు.
సంజయ్ అరెస్టుపై అన్ని వేదికలపై పోరాటం
ఉద్యోగుల విభజన తీరుపై ఇందిరాపార్కు వద్ద నిరసనలకు అనుమతినివ్వకపోవడంతో కరీంనగర్‌లోని తన కార్యాలయంలో శాంతియుతంగా సంజయ్ దీక్షకు దిగారని నడ్డా పేర్కొన్నారు. ఆయన్ను అక్రమంగా, దౌర్జన్యపూరితంగా పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సంజయ్‌పై పోలీస్ అధికారి చెయ్యి ఎలా చేసుకుంటారని నిలదీశారు. సంజయ్ అక్రమ అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిస్తామని, అన్ని వేదికలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఈ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. బీజేపీ చేతుల్లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. బుర్ర పనిచేయక పోవడంతో నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారన్నారు. ఇందిరాపార్కు, ధర్నాచౌక్ వద్ద ధర్నాలు చేయొద్దని గతంలో చెప్పిన కేసీఆరే ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిందిస్తూ స్వయంగా ధర్నాలో పాల్గొనడం విచిత్ర మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment