నేరాన్ని ప్రోత్సహించిన వారూ నేరస్తులే
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ చంద్రకుమార్ హితవు
హైదరాబాద్: ‘అయ్యా సీఎం గారూ చట్టం చదవండి నేరం చేయాలని ప్రోత్సహించిన వారూ నేరస్తులే అవుతారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవాలని సీఎంగా మీరు పిలుపు ఇవ్వడం వల్ల ఘర్షణ చోటుచేసుకుంటుంది. ఈ వ్యాఖ్యలు అనుచితం. వాటిని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక న్యాయ పాదయాత్రపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా సీఎం మాట్లాడటం సరికాదని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని విమర్శించారు. కేసీఆర్‌లో దొర మనస్తత్వం కనిపిస్తోందని ఇది మంచి పరిణామం కాదన్నారు. తెలంగాణకు కావలి కుక్కలా ఉంటానన్న కేసీఆర్ తోడేలులా దాపురించారని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ మండిపడ్డారు. ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్ జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు జి.రాములు, స్కైలాబ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.