
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, జంట నగరాల్లోని చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణ ముందుకు కదలకపోవడంతో ఇప్పుడు హైకోర్టే స్వయంగా రంగంలోకి దిగింది. సరస్సుల నగరంగా గతంలో ఉన్న ఖ్యాతిని నిలబెట్టి పూర్వవైభవం తెచ్చేందుకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళణకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున ఓ న్యాయమూర్తి ఈ విధంగా చొరవ తీసుకుని సమావేశం జరపడం ఇదే మొదటిసారి. హైకోర్టులో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశం జరిగింది. సరస్సుల నగరాలుగా పేరుగడించిన హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు, ఇప్పుడు ఆక్రమణలకు గురి కావడం, పరిశ్రమల వ్యర్థాలు, ఇతరాలతో అవి ఉనికిని కోల్పోవడంపై జస్టిస్ చౌహాన్ ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చెరువులకు, మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపు విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు జస్టిస్ చౌహాన్ దృష్టికి తీసుకొచ్చారు. మూడు నెలల్లో మొదట ఓ సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)ను ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 405 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్ చౌహాన్ దృష్టికి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ తీసుకొచ్చారు.
లోక్ అదాలత్‌ల్లో అనుభవజ్ఞులైన మధ్యవర్తుల ద్వారా ఈ కేసులను పరిష్కరిస్తామని జస్టిస్ చౌహాన్ చెప్పారు. మూసీ ప్రక్షాళణ కోసం ఏం చేయాలో క్షేత్రస్థాయి పరిస్థితులతో మూడు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ హామీ ఇచ్చారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తున్నామో వివరిస్తూ నివేదిక ఇస్తామని పీసీబీ సభ్య కార్యదర్శి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో, క్షేత్రస్థాయిలోని పరిస్థితులతో మరోసారి సమావేశం అవుదామని అధికారులందరూ హామీ ఇచ్చారు. చెరువుల పరిరక్షణ, మూసీ నది ప్రక్షాళణకు చెందిన వ్యవహారాలను ఇకపై న్యాయసేవాధికార సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని జస్టిస్ చౌహాన్ వారికి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment