ఓయూ ఉత్సవాలపై ప్రభుత్వ పెత్తనం లేదు
రాజ్యసభ సభ్యుడు కేకే వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓయూపూర్వ విద్యార్థులం దరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ కోటిన్నర మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని, 20 వేల మంది పీహెచ్‌డీలు తీసుకున్నారని కేకే తెలిపారు. శనివారం ఆయన తన నివాసంలోవిలేకరులతో మాట్లాడుతూ, యూనివర్సిటీ ఉత్సవాలపై ప్రభుత్వ పెత్తనం ఏమీలేదని, యూనివర్సిటీతో సంబంధమున్న అన్ని వర్గాలనూ ఉత్సవాల్లో భాగస్వాములను చేస్తామని తెలిపారు.
ఉత్సవాలకోసం రూ.200కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందని, సంవత్సరం పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు, పూర్వ విద్యార్థి సంఘాల నాయకులు కూడా స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లోపాల్గొంటున్నారని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరగాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు.