‘కాడెడ్లతో కరెంటు’ ప్రయోగం భేష్
సీఎల్పీనేత కుందూరు జానారెడ్డి
అఫ్జల్‌గంజ్: తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత సమయంలో మజల్ ఎనర్జీ ఎన్విరో మిషన్(మీమ్) పేరిట మాడెక్స్ సంస్థ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కాడెడ్లతో కరెంటు ఉత్పత్తి యంత్రం అద్భుతంగా ఉందని, ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామని మాజీ మంత్రి, సీఎల్పీనేత కె. జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కాడెడ్లతో కరెంటు ఉత్పత్తి అవగాహన ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాజీ ఎంపీలు జి.వివేక్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేనారెడ్డి, మాజీ మేయర్ ఎన్.లక్ష్మీనారాయణలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన కాడెడ్లతో కరెంటు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోరి మాడెక్స్ సంస్థ సీఈఓ బత్తుల జగదీష్ ఈ పరికరాన్ని కనుగొనడం అభినందనీయమన్నారు. అసలు ఈ ఆలోచన రావడం, వచ్చిన వెంటనే ఆచరణలోకి తీసుకురావడం జగదీష్ పట్టుదలకు నిదర్శనమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్‌కు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రైతులందరికీ అందుబాటు ధరల్లో లభించేలా.. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలా ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి నరోత్తమ్‌రెడ్డి, ఎకనామిక్ కమిటీ కార్యదర్శి వనం వీరేందర్, కోశాధికారి అనిల్ స్వరూప్‌మిశ్రా, ప్రతినిధులు హరినాథ్‌రెడ్డి, కృష్ణాజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
స్పందన బాగుంది: సీఈఓ బత్తుల జగదీష్
కాడెడ్లతో కరెంటు ఉత్పత్తి ప్రదర్శనకు రైతుల నుంచి విశేష స్పందన లభించిందని మాడెక్స్ సంస్థ సీఈఓ జగదీష్ అన్నారు. 3 రోజుల్లో 300 పరికరాలకు బుకింగ్ రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. తమ వద్ద ఈ పరికరాన్ని కొనుగోలు చేసిన రైతులకు రెండేళ్ల పాటు గ్యారెంటీ ఇవ్వడంతో పాటు నిర్వహణ కూడా తామే చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుకింగ్ చేసిన 3 నెలల్లోగా పరికరాన్ని డెలివరీ చేస్తామన్నారు. ఈ పరికరం ద్వారా 4-5 ఎకరాలకు సరిపడా సాగునీరు అందించడంతో పాటు రైతుల ఇతర విద్యుత్ అవసరాలకు కూడా వినియోగించవచ్చన్నారు. మూడేళ్లు శ్రమించి 20 మంది ప్రతినిధులతో కలిసి ఈ పరికరాన్ని రూపొందించామన్నారు.
ధరలో రాయితీకి కృషి: మంత్రి పోచారం
అఫ్జల్‌గంజ్: కాడెడ్లతో విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మంగళవారం రాత్రి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. పరికరం పనితీరును పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇలాంటి పరికరాలు రూపొం దించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు సోలార్ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మాడెక్స్ సంస్థ రూపొందించిన ఈ పరికరాన్ని రైతులకు అందుబాటు ధరల్లో రాయితీపై అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.