
1 శాసనం, 2 అక్కడ లభించిన విగ్రహాలు
సాక్షి, హైదరాబాద్ : నిజాం పాలన అనగానే నిరంకుశత్వం కనిపించేది.. ఆ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు ఎదురు చూసినట్లు తెలంగాణ పల్లెలు కథలుకథలుగా చెబుతాయి. కానీ అంతకుపూర్వం కుతుబ్ షాహీ జమానాకు ముందు పాలించిన కాకతీయుల కాలం దీనికి భిన్నం. చక్రవర్తి ఎవరైనా, పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరిసింది. ఫలితం.. ప్రజలు కూడా పాలకులు చల్లగా ఉండాలని దీవించేవారు. ఇంట్లో శుభకార్యం జరిగినా, అశుభం అనంతరం చేసే కార్యక్రమాల్లోనైనా పాలకుల క్షేమాన్ని ప్రత్యేకంగా కాంక్షించేవారు. దీన్ని స్పష్టం చేస్తూ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో ఆదివారం ఓ శాసనం బయటపడింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు రాగి మురళి గుర్తించగా, బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ వివరాలు వెల్లడించారు.
కొడుకు చనిపోయినా..
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో ప్రస్తుత నల్లగొండ ప్రాం తాన్ని మహాప్రధాన రాయబొల్లయ్య పర్యవేక్షించారు. అంటే ఆయన స్థానిక పాలకుడన్నమాట. ఇక్కడ ప్రాంతీయ వ్యవహారాలు పర్యవేక్షించే చంగల్‌దేవుడి కుమారుడు గణపయ్య మృతి చెందడంతో కొడుకు పేరిట స్థానిక గణాధీశ్వర (గణపతి) దేవాలయానికి ఆయన దశబంధబలి ప్రకటించారు. అంటే.. చెరువు కింద తనకున్న భూమిలో పదో వంతు మాన్యం దానంగా ఇచ్చాడు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, నైవేద్యం, ఇతర భోగాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ సమయంలో ఆయన శాసనం వేయించారు. శైవ సంప్రదాయం అనుసరించేవారు ఇలాంటి మరణానంతర కార్యక్రమాలపై ఏర్పాటు చేయించే శాసనంపై నంది శిల్పం చెక్కించేవారు. ఈ శాసనం కూడా ఆ పద్ధతిలో ఉంది. దాన వివరాలు పొందుపరిచిన తర్వాత గణపతి దేవ చక్రవర్తి పుణ్యంగా ఉండాలని అం దులో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
శాసనంలో ఏముందంటే..
రాజవంశం: కాకతీయ
రాజు: గణపతిదేవ చక్రవర్తి
కాలం: శాలివాహన శక సంవత్సరం 1,168 (క్రీ.శ.1,246), పరాభవ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి వడ్డెవారం (శనివారం) అని ప్రారంభించారు. తెలుగు లిపిలో మొత్తం 39 పంక్తుల్లో శిలకు మూడు వైపులా అక్షరాలు చెక్కించారు. గతంలోనూ ఈ తరహాలో.. చక్రవర్తి పేరును ప్రస్తావిస్తూ సామాన్యులు చెక్కించిన శాసనాలు వెలుగు చూశాయి. తాజా శాసనం నాటి పాలకుల పట్ల ప్రజల అభిమానాన్ని స్పష్టం చేస్తోంది. సాధారణంగా పెద్దలు చనిపోతే పిల్లలు శాసనాలు వేయించిన దాఖలాలు వెలుగు చూడగా, కొడుకు పేరిట తండ్రి వేయించిన శాసనం వెలుగులోకి రావడం అరుదని హరగోపాల్ పేర్కొన్నారు. శాసనం సమీపంలో బాలసుబ్రహ్మణ్య స్వామి, భైరవుడు, గణపతి, ఆంజనేయుడు, లింగం లేని పానవట్టం ఉన్నాయి. ఇవి అప్పట్లో ఇక్కడున్న దేవాలయం ఆనవాళ్లు అయి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment